పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో ఇప్పుడు భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. హీరోలు, దర్శకుల మార్కెట్ విస్తృతి మరింతగా పెరిగింది. అందుకే దర్శకులు కూడా ఎప్పుడు ఏ భాషకు చెందిన హీరోతో సినిమా చేస్తారో ఊహించలేని పరిస్థితి. మొన్నటివరకు కన్నడ హీరో యష్ సినిమా చేసిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు తెలుగులో ప్రభాస్ 'సలార్' చేస్తున్నారు. అది పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. అలాగే తమిళ దర్శకుడు లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో రామ్ కథానాయకుడిగా ఓ సినిమా చేస్తున్నారు. అలా మహిళా దర్శకురాలు సుధ కొంగర కూడా తదుపరి తెలుగు కథానాయకులతోనే సినిమా చేయడానికి కథ సిద్ధం చేశారని సమాచారం.
ఆమె ఇదివరకు తెలుగులో 'గురు' సినిమాని తెరకెక్కించారు. గతేడాది సూర్య కథానాయకుడిగా తీసిన 'ఆకాశం నీ హద్దురా' ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ చక్కటి ఆదరణ సొంతం చేసుకుంది. స్వతహాగా తెలుగువారైన సుధ.. ఈసారి తెలుగు కథానాయకులతోనే సినిమా చేయడాని సన్నాహాలు చేసుకుంటున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆమెతో జట్టు కట్టే ఆ హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.