"ఓ దర్శకుడికి తన సిగ్నేచర్ ఇది అని పేరొచ్చిందంటే.. అది మామూలు విషయం కాదు. అలా తమకంటూ ఓ స్టైల్ ఏర్పరచుకోగలగడం కొందరు డైరెక్టర్లకే సాధ్యమవుతుంది. అది నా విషయంలో జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు డైరెక్టర్ శ్రీను వైట్ల. యాక్షన్ కథలకు తనదైన శైలి హాస్యాన్ని జత చేస్తూ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన దర్శకుడాయన. ఈ పంథాలోనే మహేశ్‌బాబుతో కలిసి 'దూకుడు' చిత్రంతో వెండితెరపై నవ్వులు పూయించారు. ఈ సినిమా విడుదలై గురువారం నాటికి 10 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీనువైట్ల పలు విషయాలు చెప్పారు.
"దూకుడు'కు రిఫరెన్స్ లేదు. అప్పట్లో అదొక పెద్ద ప్రయోగం. అందుకే కచ్చితంగా సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందన్న ధీమా ఉండేది. మేము ఊహించిన దానికి మించి ప్రేక్షకులు భారీ విజయాన్ని అందించారు. మహేశ్‌బాబును దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కథ ఇది. మహేశ్‌ను కేబీఆర్ పార్క్ దగ్గర బాక్సింగ్ చేస్తున్నప్పుడు చూసి.. ఆయన ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందని ఊహించుకున్నాను. అలా ఆ ఊహలో నుంచే కథ పుట్టింది. సినిమాలో పోలీస్‌గా, ఎమ్మెల్యేగా, ఫిల్మ్ మేకర్‌గా మహేశ్ మూడు షేడ్స్ ఉన్న పాత్రలు పోషించారు. అవన్నీ వర్కవుటయ్యాయి. దాని వల్లే సినిమాకు ఆస్థాయి వచ్చిందనుకుంటాను"
అందుకే వరుస పరాజయాలు
"కామెడీ బాగా తీసే దర్శకుడని నాపై ఓ బలమైన ముద్ర పడిపోయింది. అయితే 'దూకుడు' తర్వాత నుంచి ప్రేక్షకులు నా సినిమాల్లో కామెడీ మోతాదు ఎక్కువ ఆశించడం మొదలైంది. నేను ఆ అంచనాల్ని అందుకునేలా.. నా కామెడీ టైమింగ్‌కు తగిన కథల్ని సరిగ్గా ఎంచుకోలేకపోయా. ఫలితంగా పరాజయాలు చవిచూశా. అందుకే మళ్లీ ఆ పొరపాటు చేయను. ఇకపై ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుంటూనే.. నా కామెడీకి సూటయ్యే కథలే చేయాలని బలంగా నిర్ణయించుకున్నా"
నవంబరులో 'డి అండ్ డి'
కరోనా పరిస్థితుల వల్లే 'డి అండ్ డి' ఆలస్యమైంది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రమిది. నవంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది. జనవరి.. ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది 'ఢీ'కి సీక్వెల్ కాదు. కాకపోతే ఆ సినిమాలోని ఫ్లేవర్ ఉంటుంది. ఇది పూర్తి భిన్నమైన కథతోనే రూపొందుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాకైపోయింది. ఈ కొనసాగింపు చిత్రంలోనూ బ్రహ్మానందంతో పాటు మరికొన్ని పాత్రలు కనిపిస్తాయి. ఈ సినిమా తర్వాత వెంట వెంటనే రెండు చిత్రాలు చేస్తా. వాటికి కథలూ సిద్ధమయ్యాయి.
'దూకుడు'సీక్వెల్ కాదు.. కానీ!
"దూకుడు'కు సీక్వెల్ కాదు కానీ.. తనతో కచ్చితంగా ఓ చిత్రం చేయాలనైతే బలంగా ఉంది. ఇప్పటికే దానికి తగ్గ కథాలోచన రెడీగా ఉంది. ప్రస్తుతం నా దగ్గర మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. అవి పూర్తయ్యేలోపు ఈ స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తా. ఈసారి మా ఇద్దరి కలయికలో రాబోయే సినిమా పెద్ద స్థాయిలో ఉండాలనుకుంటున్నా. అందుకు తగ్గట్లుగా స్క్రిప్ట్ సిద్ధమైనట్లేనని నాకు అనిపించగానే.. మహేశ్‌ను కలిసి కథ చెప్పి, ఒప్పించే ప్రయత్నం చేస్తా".