నటీనటులు, వారి కుటుంబసభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సినీ పరిశ్రమ మొత్తం ఏకతాటి మీదకు వచ్చి తమకు చేతనైనంత సాయం చేస్తుంది. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ప్రముఖ సినీ జర్నలిస్ట్, వ్యాఖ్యాత, నటుడు టీఎన్‌ఆర్ ఇటీవల కరోనాతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు.. వారి కుటుంబానికి ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా దర్శకుడు మారుతి రూ.50 వేలను తక్షణ ఆర్థికసాయంగా టీఎన్‌ఆర్ కుటుంబసభ్యులకు అందించారు.
"టీఎన్‌ఆర్ మేము నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం. కానీ, మీ కుటుంబానికి అండగా ఉంటాం. మీరు కూడా ఆ కుటుంబానికి సాయం అందించండి" అని మారుతి ట్వీట్ చేశారు. అలాగే చిరంజీవి, సంపూర్ణేష్‌బాబు కూడా తమవంతు సాయంగా కొంత మొత్తాన్ని టీఎన్‌ఆర్ కుటుంబానికి అందించారు. ఇప్పటికే చిరు.. టీఎన్‌ఆర్ సతీమణిని ఫోన్‌లో పరామర్శించారు.