108 సినిమాలకు దర్శకత్వం.. 18 పరభాషా చిత్రాలకు డైరెక్షన్.. ఐదు తరాల నటులతో కలిసి పనిచేయడం.. నిర్మాత 8 సినిమాలు.. నాలుగు చిత్రాలకు దర్శకత్వ పర్యవేక్షణ.. ఎన్నో ప్రముఖ అవార్డులు.. ఇవన్నీ ఒక్కరి వల్ల సాధ్యమవుతుందా అంటే కచ్చితంగా జరుగుతుందని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిరూపించారు. ఆదివారం(మే 23) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ విశేషాలు మీకోసం.
నాలుగున్నర దశాబ్దాల కెరీర్లో ఎన్నో అపురూప, అద్భుత చిత్రాలను అందించిన రాఘవేంద్రరావు.. కథానాయకుడిగా ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ నటుడు-రచయిత తనికెళ్ల భరణి.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇందులో రాఘవేంద్రరావు పాత్ర ఎలా ఉండబోతోంది? కథానాయకుడిగా అదరగొడతారా? అసలు ఈ సినిమా కథేంటి? లాంటి ఎన్నో ప్రశ్నలు.. ఆయన అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడి మదిలో మెదులుతున్నాయి.
త్వరలో వీటన్నింటికి సమాధానం దొరికే అవకాశముంది. రాఘవేంద్రరావు కథానాయకుడిగా నటిస్తున్న సినిమా అయితే ధ్రువీకరణ అయింది. కానీ దాని గురించిన వివరాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర అంశాల గురించి చిత్రబృందం వెల్లడించాల్సి ఉంది.
ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలను తన దర్శకత్వంతో అద్భుతంగా చూపించిన ఆయన ఇప్పుడు కథానాయకుడిగా ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తారో చూడాలి?
రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ప్రస్తుతం 'పెళ్లి సంద.. డి' సినిమా తెరకెక్కుతోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. గౌరి రోనంకి దర్శకురాలు. ఈ ఏడాది చివర్లో, వచ్చే సంవత్సరం ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చే అవకాశముందీ చిత్రం.
ఇది చదవండి: అనుష్కకు ఆ విషయం అప్పుడే చెప్పా: రాఘవేంద్రరావు