తన మొదటి చిత్రం 'పలాస 1978'తో దర్శకుడు కరుణ కుమార్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అదే ఊపుతో దూసుకుపోతున్నారు. సుధీర్‌బాబు ప్రధాన పాత్రలో 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే మోషన్ పోస్టర్ విడుదలైంది. ఇందులో ప్రముఖ నటి శ్రీదేవి ఫొటో ఉండటం ఎంతో ఆసక్తికరంగా మారింది.
'ఇందులో శ్రీదేవి, గోలీ సోడా..సినిమాకు ఆత్మ లాంటివి. మొదటి నుంచి చివరి వరకు ఇవే చిత్రాన్ని నడిపిస్తాయి. ఈ చిత్రం సరదాగాసాగే ప్రేమకథ. ప్రేక్షకుల ధ్యాసను మళ్లిస్తుంది' అని కరుణ కుమార్ చెప్పారు.
సుధీర్‌బాబు ఈ చిత్రంలో విద్యుత్ కార్మికుడిగా కనిపించనున్నారు. అతడు ఈస్ట్ గోదావరి గ్రామీణ యువకుడు. శ్రీదేవికి, గోలీసోడాకు సంబంధం ఏంటి? చిత్రం పేరు ఎందుకు అలా పెట్టారు? సుధీర్‌బాబుకు శ్రీదేవి అంటే ఇష్టమా?ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
'సుధీర్‌బాబు పోషించిన పాత్రల్లోకెల్లా ఇది భిన్నమైనది. ఓ మైలు రాయిగా ఆయన కెరీర్‌లో నిలిచిపోతుంది. నా రెండో సినిమా సుధీర్‌బాబుతో చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో సహజంగా చూపించాలనుకుంటున్నాం. అందుకు సుధీర్‌బాబు గోదావరి యాసను నేర్చుకుంటున్నారు. ఈ కొత్త అవతారం ఆయన అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది' అని కరుణ కుమార్ అన్నారు.
కొవిడ్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్.. నవంబర్ చివర్లో ప్రారంభమవుతుంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, తక్కువ మంది సభ్యులతో తెరకెక్కించనున్నామని దర్శకుడు తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">