"సినిమా అనేది నాకు స్వర్గం. అదే నాకు కావాల్సినంత ఎనర్జీని అందిస్తుంటుంది. అందుకే ఎప్పుడూ చిత్రీకరణలతో ఆ స్వర్గంలోనే సందడిగా గడపాలని కోరుకుంటా" అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. 'పటాస్' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే వెండితెరపై నవ్వుల పటాస్‌లు పేల్చి 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్ 2' చిత్రాలతో సినీప్రియులకు వినోదాలు పంచిన దర్శకుడాయన. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. సోమవారం (నవంబరు 23) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి ముచ్చటించారు.
పుట్టినరోజు జరుపుకోవడంపై మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?
పుట్టినరోజు అనేది ప్రతి మనిషికీ ఎంతో ముఖ్యమైన రోజు. ఈ భూమి మీదకి వచ్చి ఇన్ని సాధించగలుగుతున్నామంటే ఆరోజుకి కచ్చితంగా ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి. ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులు గర్వపడే విజయాలు సాధించాలి.
ఇంతకీ ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏంటి?
నాకీ పుట్టినరోజు చాలా స్పెషల్. ఈ ఏడాది నాకు చాలా ఆనందాల్ని పంచింది. 'సరిలేరు నీకెవ్వరు'తో విజయాన్ని అందుకున్నా. మా భార్య భార్గవి, పాప శ్రేయాశ్రీకి తోడుగా మా కుటుంబంలోకి అజయ్ సూర్యాంశ్ అడుగు పెట్టాడు. అందుకే ఈసారి పుత్రోత్సాహంతో పుట్టినరోజుని మరింత ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటాను.
ఐదేళ్ల సినీ ప్రయాణంలో ఐదు విజయాలు. ఎలా అనిపిస్తుంది?
నిజంగా ఇది అదృష్టం. ప్రతి చిత్రం విజయవంతమవ్వాలనే కష్టపడతాం. కొన్నిసార్లు ఫలితం అటు ఇటు అవ్వొచ్చు. కానీ, నేను వరుసగా ఐదు విజయాలు అందుకొన్నా. దీని వల్ల దర్శకుడిగా మంచి గుర్తింపు సాధించడమే కాక ఆర్థికంగా స్థిరపడ్డా. చాలా ఆనందంగా ఉంది.
'సరిలేరు నీకెవ్వరు' ఫలితం ఎలాంటి సంతృప్తినిచ్చింది?
ప్రతి దర్శకుడికీ ఓ పెద్ద హీరోతో పని చెయ్యాలని లక్ష్యం ఉంటుంది. ఆ అవకాశం వెంటనే దొరికితే వచ్చే ఉత్సాహమే వేరు. నాకు ఆ కల 'సరిలేరు..'తో తీరింది. నేను 45 నిమిషాలు కథ చెప్పగానే.. మహేష్ నన్ను నమ్మి సినిమా చేస్తా అన్నారు. ఆ మాట వినగానే కళ్లలో నీళ్లు తిరిగాయి. దీనికి తగ్గట్లుగానే సినిమా మంచి విజయాన్ని అందుకోవడం వల్ల నా సంతోషం రెట్టింపయ్యింది.
'ఎఫ్ 3' పనులు ఎంత వరకొచ్చాయి? సినిమా ఎలా ఉండబోతుంది?
కరోనా వ్యాక్సిన్ సంగతి ఎలా ఉన్నా కచ్చితంగా 'ఎఫ్ 3'తో ప్రేక్షకులకు నవ్వుల వ్యాక్సిన్ అందుతుందని గ్యారెంటీ ఇవ్వగలను. ఫన్ అండ్ ప్రస్టేషన్కు మరో ఎఫ్ యాడ్ అవుతుంది. గెట్ రెడీ ఫర్ మోర్ ఫన్ అని దానర్థం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. దిల్‌రాజుగారు డిసెంబరు 14 నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు.
భవిష్యత్ లక్ష్యాలేంటి?
చాలా ఆలోచనలున్నాయి. దర్శకుడిగా ఒక దాని తర్వాత మరొకటి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా. ప్రేక్షకులు ఆదరించినంత కాలం ఇలాగే నా అనుకున్న వాళ్లతో కలిసి ముందుకెళ్లాలి అనుకుంటున్నా. ఇటీవలే నా మిత్రుడు సాయితో కలిసి ప్రొడక్షన్లోకి అడుగుపెట్టా. ఇకపై నిర్మాతగానూ వైవిధ్యభరిత సినిమాలు చేసుకుంటూ వెళ్తా.
నటుడిగా అప్పుడే
"ప్రేక్షకులు దర్శకుడిగా 'ఇక చాలు బాబు' అనే వరకు సినిమాలు తీస్తూనే ఉంటా. ఆ తర్వాతే నటన గురించి ఆలోచిస్తా."