'ప్రతిరోజూ పండగే' అంటూ ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన దర్శకుడు మారుతి.. ఒకప్పుడు అరటి పళ్లు అమ్మేవాడినని చెప్పాడు. 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచే వివిధ రకాల పనులు చేశానన్నాడు. ఈ సంగతులన్నీ 'ఈనాడు' హాయ్‌తో పంచుకున్నాడు.
"మా ఉర్లో అరటి పళ్లు అమ్మా. ఓ ఆఫీస్‌లో బాయ్‌గా చేరా. ఇక్కడికి వచ్చాక 2డీ యానిమేషన్ చేశా. ఫ్యాకల్టీగా చేశా. పంజాగుట్టలో నంబర్ ప్లేట్లు వేసేవాడ్ని. రియల్ ఎస్టేట్ చేశా. అందులో బాగా నష్టపోయా. తర్వాత యాడ్స్ చేశా. చిరంజీవి 'ప్రజారాజ్యం' స్థాపించినప్పుడు కొన్ని ప్రకటనలు చేశా. లోగో డిజైన్ చేసి పెట్టా. 'నీలో ప్రతిభ ఉంది. కష్టపడు పైకొస్తావ్' అని అప్పుడు చిరు నన్ను ప్రోత్సహించారు"
- మారుతి, డైరెక్టర్
జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు రకరకాల పనులు చేసిన మారుతి.. ఇప్పటికీ అరటిపళ్లు అమ్మేవారో లేదా రోడ్ల మీద నెంబరు పేట్లు వేసే వ్యక్తో కనిపిస్తే తన జీవితం కళ్లముందు మెదులుతుందని అంటున్నాడు. తన పడ్డ కష్టాలు జీవితంలో మర్చిపోలేనని చెబుతున్నాడు.
"ఆ రోజుల్ని మర్చిపోతే కదా? గుర్తుకు తెచ్చుకోవడానికి..? నా గతాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. గర్వంగా చెప్పుకొంటా. 'ప్రతిరోజూ పండగే' సెట్లో ఓ అరటిపళ్ల బండి తీసుకొచ్చి పెట్టారు. చూడగానే ఆ బండి దగ్గరకు వెళ్లిపోయా. ఆ రోజుల్లో ఇలానే అమ్మేవాడిని కదా అని గుర్తుచేసుకున్నా"
- మారుతి, డైరెక్టర్
తర్వాతి సినిమా గురించి ప్రస్తుతం కథలు సిద్ధం చేసుకుంటున్నాడు దర్శకుడు మారుతి. బన్నీ వాసునే మళ్లీ నిర్మించనున్నారు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.