దర్శకుడు హరీశ్ శంకర్‌కు మెగా ఫ్యామిలీతో ఉన్న బంధం, వారిపై ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అంటే మరింత గౌరవం, వీరాభిమాని. ఆ ప్రేమను 'గబ్బర్ సింగ్' రూపంలో తెలిపాడు. పవన్ మేనరిజం, హరీశ్ దర్శకత్వం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఒకే తాటిపై నిలిచి సినిమాను 'కెవ్వు కేక' అనిపించాయి. "పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని 'గబ్బర్ సింగ్' సినిమా చూశావా? అని అడక్కూడదురా! ఎన్ని సార్లు చూశావని అడగాలి" అని 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'లో సాయి ధరమ్‌తేజ్‌తోనూ పవన్ మానియా గురించి చెప్పించాడు హరీశ్.
మరి మీరెప్పుడైనా 'గబ్బర్ సింగ్' చిత్రంలో హరీశ్ శంకర్‌ని చూశారా? అయితే నటించాడనడం కంటే మెరిశాడు అనడమే బాగుంటుంది. ఎందుకంటే రెప్పపాటు కాలంలో అలా వచ్చి ఇలా వెళ్లిపోతాడు. అది కూడా పవన్ కల్యాణ్ లుక్‌లో పైగా పోలీసు పాత్రలో. ఎక్కడంటారా.. ప్రత్యేక గీతం 'కెవ్వు కేక' పతాక సన్నివేశంలో చెక్ పోస్ట్ దగ్గర విలన్లను ఆపేందుకు రోడ్డుపై నిల్చుంటాడు హరీశ్. పరీక్షించి చూస్తే కానీ పవనా, హరీశా అనేది తెలియదు. ఒక్క సెకనులో కనిపించి మాయమవుతాడు. వెంటనే ఆ షాట్‌లో పవన్ దర్శనమిస్తాడు. ఇలా పవన్‌తో నటించే కోరిక కూడా నెరవేర్చుకున్నాడు హరీశ్. త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతోంది. అది ఎన్ని రికార్డులు సృష్టిస్తుందోనని ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు
ఇదీ చూడండి : 'మనం' దర్శకుడితో మరోసారి నాగచైతన్య!