ట్రాజెడీ హీరోగా.. మిగిలిన హీరోలకు లేని వైవిధ్యమైన గుర్తింపు దిలీప్ కుమార్‌కు మాత్రమే దక్కింది. విషాదాంతంగా ముగిసే పాత్రల్లో తనకు సాటి మరెవరూ లేరనే విధంగా దిలీప్ కుమార్ నటించేవారు. 1948లో 'నదియా కే పార్' తో మొదలు పెడితే.. మేలా, అందాజ్, జోగన్, బబుల్, అర్జూ, దీదర్, తరానా, దాగ్, శిఖస్త్ సినిమాల్లో విషాధ ఛాయలున్న పాత్రలు పోషించి ట్రాజెడీ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు దిలీప్ కుమార్.
ఆ పేరును మరో మెట్టెక్కిస్తూ.. 1954లో వచ్చిన అమర్, 1955లో వచ్చిన దేవదాస్, 1958లో వచ్చిన మధుమతి, 1966లో నటించిన దిల్ దియా దర్ద్ లియా, 1968 లోని ఆద్మీ చిత్రాల్లో నటించారు దిలీప్ కుమార్.
దేశంలో పలు భాషల్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం 'దేవదాస్'లో దిలీప్ కుమార్ నటన.. జీవితకాలపు అనుభూతినిస్తుందనే పేరు సంపాదించారు.
భగ్న ప్రేమికుడిగా.. కళ్లతోనే విషాదాన్ని పలికిస్తూ దిలీప్ చూపిన హావభావాలు, ఆయన మెథడ్ యాక్టింగ్ నటన అనే పదానికి నిర్వచనంగా చరిత్రలో నిలిచిపోయారు. విపరీతంగా ట్రాజెడీ రోల్స్ చేయటం వల్ల ఆయన మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో విషాదపాత్రలు పోషించటం మానేయాలని లేదా సినిమాలు వదిలేయాలని వైద్యులు సూచించగా ఆందోళనకు లోనైన దిలీప్ కుమార్.. తన పంథా మార్చి తనలోని మరో కొత్త నటుడిని వెతుక్కున్నారు.
ఆ చిత్రంతో హిట్ పెయిర్..
1955లో హాస్యప్రధానంగా వచ్చిన ఆజాద్ చిత్రంలో తనలోని కామెడీ టైమింగ్ ను తొలిసారి దిలీప్ కుమార్ ప్రేక్షకులకు రుచిచూపించారు. 1960లో 'మొఘల్ ఏ ఆజమ్' చిత్రంలో సలీంగా మరోమారు ప్రేమికుడి అవతారమెత్తిన దిలీప్ కుమార్.. అందరినీ సమ్మోహనంతో కట్టిపడేశారు. అక్బర్‌గా పృథ్వీరాజ్ కపూర్ నటన, అనార్కలిగా మధుబాల అభినయానికి తోడు.. యువరాజు సలీంగా దిలీప్ కుమార్ చేసిన మెథడ్ యాక్టింగ్.. భారతీయ చిత్రపరిశ్రమ నుంచి వచ్చిన ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో ఒకటిగా మొఘల్ ఏ ఆజమ్ పేరు తెచ్చుకుంది. అంతేకాదు హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న మధుబాల- దిలీప్ కుమార్ జోడీ చాలా సంవత్సరాలు బాలీవుడ్‌ను ఏలేలా ఆ చిత్రం మాయ చేసింది.
ఐదేళ్లు సినిమాలకు దూరం..
1960ల చివరినాటికి బాలీవుడ్‌లో తొలి సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా, రాజేంద్ర కుమార్, షమ్మీ కపూర్‌ల శకం ప్రారంభమైంది. మెల్లగా దిలీప్ కుమార్‌ను పరాజయాలు పలకరించటం ప్రారంభించాయి. తన యాక్టింగ్‌తో ప్రతి చిత్రంలోనూ వందశాతం ప్రేక్షకులను అలరిస్తున్నా.. చిత్రాలు పరాజయం పాలు కావటంతో ఆందోళనకు లోనైన దిలీప్ కుమార్.. 1976లో ఐదేళ్ల పాటు పూర్తిగా చిత్రపరిశ్రమకు దూరమయ్యారు.
ఆ చిత్రంతో రిటైర్మెంట్..
నటుడు మనోజ్ కుమార్ కోరిక మేరకు.. తిరిగి 1981లో క్రాంతి చిత్రం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు దిలీప్ కుమార్. అక్కడి నుంచి హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో తనలోని నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించారు దిలీప్ కుమార్. 1982లో వచ్చిన శక్తి మొదలుకుని కర్మ, విధాత, మజ్దూర్, మాషల్, దునియా, ధరమ్ అధికారి, కానూన్ అప్నా అప్నా, ఇజ్జత్ దార్, సౌదాగర్, ఖిలా వరు రెండో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో చెలరేగిపోయారు దిలీప్ కుమార్. ఆయన నమ్మిన మెథడ్ యాక్టింగ్‌తో నటనలో పోటీపడుతుంటే అమితాబ్ బచ్చన్ లాంటి నటులు ఆయనను అందుకునేందుకు తీవ్రంగా శ్రమించేవారు. 1998లో నటించిన ఖిలాతో సినిమాలకు సగర్వంగా రిటైర్మెంట్ ప్రకటించారు. ది గ్రేట్ దిలీప్ కుమార్.
8 సార్లు ఫిలింఫేర్..
1966లో తనకంటే వయస్సులో 22 ఏళ్లు చిన్నదైన సైరా భానును దిలీప్ కుమార్ వివాహమాడారు. సైరా భాను నాటి నుంచి నేటి వరకు అనుక్షణం దిలీప్ వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకున్నారు. మధ్యలో ఈ జంట మధ్య వచ్చిన చిన్న పొరపచ్చాల కారణంగా 1981లో అస్మా సాహిబాను వివాహం చేసుకున్న దిలీప్ కుమార్.. 83లో ఆమెకు విడాకులు ఇచ్చేశారు.
తనంటే ప్రాణమిచ్చే సైరా భానును కాదని వేరే వివాహం చేసుకోవటం పెద్ద తప్పేనని చాలాసార్లు బహిరంగంగా ఒప్పుకున్నారు దిలీప్ కుమార్. వీరికి సంతానం లేదు.
మరే నటుడికీ సాధ్యం కాని రీతిలో 8సార్లు ఫిలింఫేర్ ఉత్తమ నటుడిగా పురస్కారాలు అందుకున్నారు దిలీప్ కుమార్.
అరుదైన గౌరవం..
ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ తో పాటు.. 1994లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. హిందీ చిత్ర సీమకు ఆయన అందించిన సేవలకు గుర్తుగా 1991లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ తో భారత ప్రభుత్వం దిలీప్ కుమార్ ను గౌరవించింది. తమ దేశంలో పుట్టి చిత్రపరిశ్రమకు, కళారంగానికి దిలీప్ కుమార్ అందించిన విశిష్ట సేవలను గుర్తించిన పాకిస్థాన్ ప్రభుత్వం 1998లో తమ అత్యున్నత పౌరపురస్కారం 'నిషాన్-ఈ-ఇంతియాజ్' తో ఆయన్ను గౌరవించింది. ఇలా భారత్- పాకిస్థాన్ రెండు దేశాలతో అత్యున్నత గౌరవాలను అందుకున్న అతి అరుదైన నటుడిగా దిలీప్ కుమార్ స్థానం అజరామరం.
రాజ్యసభ సభ్యుడిగానూ..
2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ దిలీప్ కుమార్ సేవలందించారు. ఎంపీగా తనకున్న నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. నాటి నుంచి నేటివరకు భారతీయ చిత్ర సీమలో పేరు తెచ్చుకున్న మహామహులు అంతా దిలీప్ కుమార్ ను తమకు ఇష్టమైన నటుడిగా పేర్కొంటారు.
మెథడ్ యాక్టింగ్.. కళ్లతోనే హావభావాలు పలికించటం.. పాత్రకు తగినట్లుగా ప్రవర్తించటం.. నటనలో చాతుర్యాన్ని ప్రదర్శించటం ఇలా ప్రతి విభాగంలోనూ దిలీప్ కుమార్ ఆదర్శవంతమైన వ్యక్తి. ఎన్నేళ్లయినా.. ఎన్నాళ్లయినా ఆయన చూపించిన ముద్ర సినీ ప్రేమికుల మదిలో చిరంజీవిగా మిగిలిపోతుంది. దేశం గర్వించదగిన నటుడిగా దిలీప్ కుమార్ పేరు శాశ్వతంగా సువర్ణాక్షరాలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది.
ఇదీ చదవండి: Dilip Kumar: పండ్ల వ్యాపారం నుంచి దిగ్గజ నటుడి స్థాయికి..
Dilip Kumar: 'ట్రాజెడీ కింగ్' సినీ ప్రస్థానం సాగిందిలా..!
Dilip Kumar: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత