పెరిగిన పోటీ తత్వానికి అనుగుణంగా వినూత్నంగా ఆలోచిస్తేనే... చిత్ర పరిశ్రమలో రాణించగలరని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో దాదాసాహెబ్ పాల్కే స్కూల్ ఆఫ్ ఫిలిం స్టడీస్, చిత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజుతోపాటు యువ కథానాయకుడు విశ్వక్ సేన్, యువ సినీ దర్శకుడు శైలేష్, కళాశాల ప్రిన్సిపాల్ నందన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
కళాశాలల్లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు నటుడు విశ్వక్‌సేన్, దర్శకుడు శైలేష్‌తో కలిసి దిల్‌రాజు విద్యార్థులకు పట్టాలు అందజేశారు. సినీ రంగంలో రాణించాలంటే కృషి, పట్టుదలతోపాటు సాంకేతికంగా వస్తున్న మార్పులను అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని దిల్‌రాజు విద్యార్థులకు సూచించారు. గతంలో కంటే ప్రస్తుతం సినీ రంగంలో పోటీతత్వం పెరిగిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అలవరుచుకుంటేనే ఈ రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చని తెలిపారు. యూరోపియన్ దేశాల్లో చిత్ర నిర్మాణం, అక్కడి సాంకేతికతపై ఇక్కడి విద్యార్థులకు వివరించేందుకు చిత్రోత్సవాల నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఇదీ చూడండి : రానా నాకే పోటీగా మారాడు: వెంకటేశ్