దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదల తేదిని ప్రకటించింది చిత్రబృందం. దీంతో ఆ సినిమా పంపిణీ హక్కులను కొనుగోలు చేయటానికి డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమయ్యారు. ఈ చిత్ర నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ సొంతం చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఏకంగా 76 కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమా హక్కులను కొన్నట్టు సమాచారం. అయితే, నైజాం పరిధిలో ఇప్పటివరకూ ఏ చిత్రం (బాహుబలితో సహా) 70 కోట్ల కలెక్షన్లు సాధించలేదు.
బాహుబలి కంటే ఎక్కువ..!
ఈ చిత్రం ఆంధ్ర హక్కుల కోసం వందకోట్ల లావాదేవీ జరిగిందని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు సీడెడ్‌లో 50 కోట్ల రూపాయలకు సినిమా అమ్ముడైందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరుకు ఉన్న సమాచారంతో తెలుగురాష్ట్రాల్లో 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాకు 225 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. అంటే బాహుబలి కంటే 20 కోట్ల రూపాయలు ఎక్కువ ధర పలికిందన్నమాట.
ఒక్క పైసా అక్కర్లేదు..
'ఆర్‌ఆర్‌ఆర్'లో అజయ్‌దేవగణ్ పోషిస్తున్న అతిథి పాత్ర కోసం ఒక్క పైసా తీసుకోవడం లేదని సమాచారం. చిత్ర నిర్మాతలు అజయ్‌కు పారితోషికం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారట. కానీ, అతడు తీసుకునేందుకు ఇష్టపడటం లేడని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 'ఒక స్నేహితుడి కోసం స్నేహపూర్వకంగా అతిథి పాత్ర పోషించేందుకు ఒప్పుకున్నాడు. అజయ్ డబ్బులేమీ ఆశించలేదు' అని అతడి సన్నిహితులు చెబుతున్నారు.
ఇదీ చూడండి.. 'నాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి'