బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ నటించిన 'దంగల్' చిత్రం 2016 డిసెంబర్ 23న విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించింది. పాకిస్థాన్లో మాత్రం విడుదలవలేదు.
పాకిస్థాన్లో ఆమిర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. 'దంగల్'నూ అక్కడ విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. ఆ దేశ సెన్సార్ బోర్డు మాత్రం సినిమాలో భారత జాతీయ గీతాన్ని, జెండాను తొలగించి విడుదల చేయాలనే నిబంధన విధించింది. అందుకే పాక్లో సినిమాను విడుదల చేయాలనే ఆలోచన విరమించుకుంది చిత్రబృందం.
మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా 'దంగల్' తెరకెక్కింది. మహావీర్ కూతుళ్లు బబితా కుమారి, గీతా ఫోగట్ పాత్రల్లో ఇద్దరు బాలికలు నటించారు. వీరిద్దరి పాత్రల కోసం సుమారు 3 వేల మందికి అడిషన్స్ నిర్వహించారు. ఆసక్తికర విషయమేంటంటే ఈ చిత్రంలో నటించాలని ఉత్సాహంతో నటి మల్లికా షెరావత్ అడిషన్స్లో పాల్గొంది. కానీ ఎంపిక కాలేదు.