దేశంలో కరోనా వైరస్(కొవిడ్-19) నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపట్టాయి. కరోనా కట్టడిలో భాగంగా సినీ పరిశ్రమ కూడా తమవంతు బాధ్యతగా ఇప్పటికే పలు చిత్రాల షూటింగ్స్ నిలిపివేయడమే కాకుండా సినిమా విడుదల కార్యక్రమాలను కూడా వాయిదా వేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా కపిల్ దేవ్ జీవితాధారంగా చేసుకుని బాలీవుడ్‌లో తెరకెక్కిన '83' మూవీ వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సోషల్‌మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలిపింది.
"ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతిఒక్కరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని '83' సినిమా విడుదలను నిలిపివేస్తున్నాం. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత సినిమా విడుదల విషయంపై నిర్ణయం తీసుకుంటాం. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలను పాటించాలని అభిమానులకు తెలియజేస్తున్నాం. కష్టాలను ఎదుర్కొని విజయాన్ని సాధించడమే మా '83' చిత్రం. అలాగే మనం కూడా ఈ కరోనా కష్టం నుంచి త్వరలోనే బయటపడతామని ఆశిస్తున్నాం."
-83 చిత్రబృందం.
భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిందీ చిత్రం. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్ సింగ్.. కపిల్ సతీమణి రోమీ భాటియాగా దీపికా పదుకొణె నటించారు. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా ప్రస్తుతం ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.
ఇదీ చూడండి : ఆ దర్శకుడి వల్లే నన్నెవరూ ప్రేమించట్లేదు!