యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్-టైగర్ ష్రాఫ్ కాంబినేషన్లో ఓ సినిమా చిత్రీకరణ ముంబయిలో జరుగుతోంది. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్‌లు ఉగ్రవాదుల పాత్రలు పోషిస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్‌లు, సూసైడ్ బాంబర్స్ గెటప్‌లు ధరించారు. అయితే చిత్రీకరణ సమయంలో కాస్త ఖాళీ సమయం దొరకగా... ఇద్దరూ అవే గెటప్‌లతో పక్కనే ఉన్న ఓ దుకాణానికి వెళ్లారు. వారిని చూసిన స్థానికులు ఉగ్రవాదులు అనుకుని భయబ్రాంతులకు గురయ్యారు.
టెర్రరిస్టులు అనే అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు జూనియర్ ఆర్టిస్ట్‌లమని ఎంత చెప్పినా ఎవ్వరూ వినలేదు. విషయం తెలియగానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన నిర్మాతలు... ఆర్టిస్ట్‌లని ఆధారాలు చూపించిన తర్వాతే విడిచిపెట్టారట. ఈ ఘటనతో చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు.