- మన కాలంలో నిర్మితమైన గొప్ప ఐతిహాసిక చిత్రం క్లియోపాత్ర - భోస్లీ క్రోధర్, అమెరికన్ జర్నలిస్ట్, న్యూయార్క్ టైమ్స్.
- ఆద్యంతం నేత్రపర్వమే కాదు...ఒకనాటి చరిత్రకు అద్దం పట్టిన సాహితీ విలువలున్న చిత్రం - వెరైటీ పత్రికలో ఓ సమీక్ష.
- క్లియోపాత్ర నిస్సందేహంగా చలనచిత్ర దిగ్గజం. చిత్రం చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు గజిబిజిగా, మందకొడిగా అనిపించినా... తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చూడతగ్గది. చిత్రంలో ఆవిష్కృతమైన గ్లామర్‌కి థాంక్స్ - బిల్లీ మౌబ్రే, బ్రిటిష్ టెలివిజన్ ఛానెల్ నిర్వహణలో ఫిలిం ఫోర్ వెబ్ సైట్ సమీక్షకుడు.
- నటన, ఇమేజ్ పరంగా క్లియోపాత్ర అంత గొప్ప సినిమా కాదు. అనేక లోపాలు, చిక్కు ముళ్లు ఉన్నాయి - జుడిత్ క్రీస్ట్, టైం పత్రిక సమీక్షకుడు.
చిత్రం: ‘క్లియోపాత్ర’
తారాగణం:ఎలిజబిత్ టేలర్, రిచర్డ్ బర్ డన్, రెక్స్ హారిసన్, రోడ్డి మాక్డో వాల్, మార్టిన్ లాండా, హ్యూమ్ క్రోనిన్, జార్జి కోల్.
మూల కధ:ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ క్లియోపాత్ర రచన ఆధారం.
రచయిత: సీఎం ఫ్రాంజీరో. హిస్టరీస్: పూల్టార్చ్, సుటోనియాస్, అప్పియన్ చారిత్రక కధనాలు
సంగీతం:అలెక్స్ నార్త్, చిత్రానువాదం: జోసెఫ్ ఎల్ మన్కివిజ్, రోనాల్డ్ మెక్డొగలే, సిడ్నీ బుజ్ మాన్,
సినిమాటోగ్రఫీ:లియోన్ సామ్ రాయ్, ఎడిటర్:దురోతి స్పెన్సర్, నిర్మాత: వాల్తేర్ వెంజర్,
దర్శకుడు:జోసెఫ్ ఎల్ మన్కివిజ్, పంపిణీదారులు:ట్వంటియత్ సెంచరీ; ఫాక్స్ ఫిలిం కార్పొరేషన్,
చిత్రం నిడివి:248 నిముషాలు, విడుదల తేదీ:12 జూన్ 1963,
నిర్మాణ వ్యయం:31.1 మిలియన్ డాలర్లు, వసూళ్లు:57.8 మిలియన్ డాలర్లు.
బాక్సాఫీస్ బద్దలు:
1963 ప్రాంతాల్లో భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాగా క్లియోపాత్ర సంచలనం సృష్టించింది. 31.1మిలియన్ డాలర్లతో అప్పట్లో ఓ సినిమా తీయడమంటే కనివిని ఎరుగనిదే. పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడమే కాకుండా 57.మిలియన్ డాలర్ల వసూళ్లతో సత్తా చాటుకున్న చిత్రం క్లియోపాత్ర. 36వ అకాడమీ అవార్డ్స్‌లో ఈ చిత్రం ఏకంగా 9 నామినేషన్స్ అందుకుంది. ఉత్తమ చిత్రం అవార్డుతో సహా బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (కలర్), బెస్ట్ సినిమాటోగ్రఫీ (కలర్), బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్...విభాగాల్లో అవార్డులు అందుకుంది.
1963 నేషనల్ బోర్డు ఆఫ్ రివ్యూ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా రెక్స్ హర్రిసన్ విజేతగా నిలిచారు. 1964 ఎడ్డీ అవార్డ్స్ లో బెస్ట్ ఏడిటెడ్ ఫీచర్ ఫిలిం విభాగంలో దొరతి స్పెన్సర్ నామినేట్ అయ్యారు. 1964 గోల్డెన్ గ్లోబ్స్‌లో బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామాగా క్లియోపాత్ర, బెస్ట్ మోషన్ పిక్చర్ యాక్టర్ (డ్రామా) విభాగంలో రెక్స్ హర్రిసన్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా రోడ్డి మాక్డో వాల్, బెస్ట్ డైరెక్టర్‌గా జోసెఫ్ ఎల్ మన్కివిజ్ నామినేట్ అయ్యారు.
1964 లాయెల్ అవార్డ్స్ టాప్ రోడ్‌షో విభాగంలో ‘క్లియోపాత్ర’ చిత్రం విజేతగా నిలిచింది. లాయెల్ అవార్డ్స్‌లో టాప్ మేల్ డ్రమెటిక్ పర్ ఫార్మెన్స్ విభాగంలో రెక్సీ హారిసన్ నామినేట్ అయ్యారు.
1964 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్‌గా రెక్స్ హర్రిసన్, బెస్ట్ ప్రొడ్యూసర్‌గా వాల్తేర్ వెంజర్ నామినేట్ అయ్యారు. 1964 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా లియోన్ సామ్ రాయ్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్‌గా జాన్ డిక్యూర్, జాక్ మార్టిన్ స్మిత్, హెర్మన్ ఏ బ్లూ మెంథాల్ బృందం సభ్యులు గెలుచుకున్నారు.
1964 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఇరాన్ ష్రాఫ్, విటోరియో నినో నోవర్స్, రీనియె గెలిచారు. 1964 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ సౌండ్ విభాగంలో జేమ్స్ కోకో రన్ నామినేట్ అయ్యారు.
1964 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ విభాగంలో దురోతి స్పెన్సర్ విజేతగా నిలిచారు.
1964 గ్రామీ అవార్డ్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగంలో ఆలిస్ నార్త్ నామినేట్ అయ్యారు.
దర్శకుడి మదిలో క్లియోపాత్ర రెండుభాగాలు
దర్శకుడు జోసెఫ్ ఎల్ మన్కివిజ్ ‘క్లియోపాత్ర’ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించాలని అనుకున్నారు. సీజర్ - క్లియోపాత్ర ఓ భాగంగా, ఆంథోనీ - క్లియోపాత్ర రెండో భాగంగా తీర్చిదిద్దాలని ఆయన భావించారు. ఒక్కో భాగం నిడివి మూడు గంటల చొప్పున ఉంటుంది. అయితే, చిత్రాన్ని నిర్మిస్తున్న ట్వంటియత్ సెంచరీ; ఫాక్స్ ఫిలిం కార్పొరేషన్ దర్శకుడి ఆలోచనలని అంగీకరించలేదు. దాంతో, ఇప్పుడు మనం చూస్తున్న సినిమా ఒకే భాగంగా రూపొందింది. ఈ చిత్రం నిడివి నాలుగు గంటలు. మరో రెండు గంటల సినిమా దర్శకుడి మదిలో నుంచి బయటకి రాలేదు.
‘క్లియోపాత్ర’ చిత్రంలో ఆక్టివియాన్ ఎలియాస్ ఆగస్టస్‌గా నటించిన రోడ్డి మాక్డో వాల్‌ని సహాయ నటుడిగా కాకుండా అకాడమీ అవార్డుల కోసం ప్రధాన పాత్రధారుడిగా నిర్మాణ సంస్థ పొరపాటున పంపించింది. ఈ పొరపాటును సవరించాల్సిందిగా నిర్మాణ సంస్థ అకాడమీని అభ్యర్ధించింది. అయితే, అకాడమీ ఈ అభ్యర్ధనని పరిగణనలోనికి తీసుకోలేదు. అప్పటికే బాలట్ ప్రక్రియ పూర్తయిందంటూ సమాధానం ఇచ్చింది. దాంతో, ఫాస్ కంపెనీ హుటాహుటిన అన్ని పత్రికల్లో ఓ ప్రకటన చేస్తూ రోడ్డి మాక్డో వాల్‌కి క్షమాపణ కోరింది. చిత్రంలో ప్రదర్శించిన ఆగస్టస్‌గా రోడ్డి మాక్డో వాల్ నటనకి విమర్శకుల ప్రశంసలు లభిచాయని చెప్తూనే... ఆ కేటగిరిలో అకాడమీ అవార్డుకి తమ నామినేషన్‌కి అర్హత లేదంటూ పేర్కొంది.
‘క్లియోపాత్ర’ చిత్రం కోసం నౌకాదళాన్ని చూపిస్తూ పడవలు, నౌకలు భారీ సంఖ్యలో చూపించారు. అప్పట్లో ఆ స్థాయిలో నౌకాదళం ఉండేది.
చిత్రంలో నాయిక క్లియోపాత్ర ప్రవేశం లైయిటింగ్ సమస్య కారణంగా కొన్ని నెలలు ఆలస్యమైనది. దాంతో, అమెరికన్ బాల నటుడు కాస్త పొడవు పెరిగినందువల్ల ఆ నటుడి స్థానంలో ఓ ఇటాలియన్ బాలనటుడిని నిర్మాణ సంస్థ తీసుకోవాల్సి వచ్చింది. అయితే, ఆ ఇటాలియన్ బాలుడు చిత్రానికి సరిపడని యాసతో నటించడం కాస్త లోపం.
‘క్లియోపాత్ర’ చిత్రం విడుదల సమయంలో 1963లో మీడియా స్పందనలు వెల్లువెత్తాయి. అమెరికన్ నటిగా అప్పటికే లబ్దప్రతిష్టురాలైన ఎలిజబిత్ టేలర్ నటించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య ఆదరణ లభించింది.
కథానాయికగా నటించిన ఎలిజబిత్ టేలర్‌కి చిత్రం పూర్తయ్యేసరికి పారితోషికంగా లభించిన మొత్తం సొమ్ము 7 మిలియన్ డాలర్లు. అప్పట్లో ఓ హీరోయిన్‌కి ఇది భారీ పారితోషికమే. అంచలంచెలుగా చెల్లించే ఒప్పందంతో ఇంత భారీ మొత్తం ఆమెకి దక్కింది.
16 వారాల పని కోసం 125 మిలియన్ డాలర్లు, వారం తరువాత 50 వేల మిలియన్ డాలర్లు...ఇలా ఒప్పందం కుదిరింది. రోమ్‌లో షూటింగ్ మళ్లీ ప్రారంభమయ్యేనాటికే ఆమె రెండు మిలియన్లకు పైగా సంపాదించింది. చిత్రంలో నటిస్తున్నప్పుడు లిజబిత్ టేలర్, రిచర్డ్ బర్ డన్‌కి నడుమ తగవులు చోటు చేసుకున్నాయి. ప్రేమ...తగవులు వారి జీవితాంతం వరకూ వెంటాడుతూనే ఉన్నాయి.
ఇది కధ కాదు
‘క్లియోపాత్ర’ జగదేకసుందరిగా ప్రసిద్ధురాలు. క్రీస్తు పూర్వం 48లో ఈజిప్టును ఏలిన మహారాణిగా విశేష ప్రాచుర్యం సంపాదించారు. రాజకీయపు ఎత్తులు రణతంత్రపు జిత్తులతో సతమతమైన జీవితం ఆమెది.
క్రీస్తు పూర్వం 69లో ఈజిప్టు అలెగ్జాండ్రియాలో జన్మించారు. ఈమె పూర్వికులు ఈజిప్ట్ వలస వచ్చిన దాలినీ వంశస్థులు. తండ్రి ఈజిప్తును పాలించేవారు. తెర లేచేసరికి పార్సలస్ యుద్ధం ముగిసిపోవడంతో జూలియస్ సీజర్ కార్యనిర్వహణాధికారి హోదాలో ఈజిప్ట్‌కి బయలుదేరుతాడు.
క్లియోపాత్ర తండ్రి దగ్గర కొలువు చేసేందుకు నియమితులవుతాడు. క్లియోపాత్ర తన సోదరుడి నుంచి సింహాసనం తనకు దాఖలు పడేలా చూడాల్సిందిగా జూలియస్ సీజర్‌ని కోరుతుంది. సామ్రాజ్యాన్ని కాపాడేందుకు ఓ పక్క చర్యలు తీసుకుంటూనే, క్లియోపాత్రని మట్టు పెట్టేందుకు ప్రయత్నించాడన్న నెపంతో పోతినెన్‌ని మరణ శిక్ష విధిస్తాడు.
ఈ ఎత్తులు పారి ఎట్టకేలకు క్లియోపాత్ర ఈజిప్టు మహారాణి అవుతుంది. సీజర్స్‌తో కలసి రాజ్యమేలుతుంది. వారిద్దరూ వివాహమాడతారు. కొడుకు పుడతాడు. ఆ కుర్రాడికి సిజేరియన్ అనే పేరు పెడతారు.
సీజర్ కి రోమ్ నేతగా మారాలని ఆకాంక్ష ఉంది. అతడు రోమ్ సెనేట్‌లో చేరుతాడు. ఓ సారి క్లియోపాత్రని రోమ్‌కి సీజర్ ఆహ్వానిస్తాడు. ఆమె పెద్ద ఊరేగింపుతో అక్కడికి చేరుకుంటుంది. రోమన్ ప్రజలంతా ఆమెకి ఘన స్వాగతం పలుకుతారు.
సీజర్‌కి రోమ్ అధినేత కావాలనే కోరిక ఉందన్న సంగతి బయటపడటంతో రోమన్లు అసంతృప్తి చెందుతారు. సీజర్‌ని అంతమొందించడానికి ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. కుట్రదారులు విజృంభిస్తారు. కుట్రలో సీజర్ మరణిస్తాడు. సీజర్ కి నమ్మిన బంటు అయిన ఆక్టివియాన్ వారసుడిగా ఎదుగుతాడని కోపంతో క్లియోపాత్ర రగిలిపోతుంటుంది.
ఆ ఆగ్రహంతోనే ఈజిప్ట్‌కి తిరిగి వస్తుంది. సీజర్ దత్త పుత్రుడు అంథోని. పర్షియా సామ్రాజ్యాన్ని స్వాధీన పరచుకోవాలనే కోరికతో అంథోని ఉంటాడు. అందుకు అతడికి డబ్బు అవసరం పడుతుంది. ఆ డబ్బు ఈజిప్టు నుంచి సేకరించాలని భావిస్తాడు. అనేక విన్నపాలు తరువాత క్లియోపాత్ర అంథోనిని ధర్సస్ లో కలుస్తుంది. అలా అలా తరచూ కలవడంతో వారిద్దరూ ప్రేమలో పడతారు.
ఆక్టివియాన్ తన బలగాన్ని ఉప సంహరించుకోవడంతో అంథోని తిరిగి రోమ్ వెళతాడు. అక్కడ ఆక్టివియాన్ సోదరిని పెళ్లాడుతాడు. ఆ తరువాత కొన్ని రోజులకి ఆమ్ విడాకులు తీసుకోవడంతో క్లియోపాత్రని అంథోని పెళ్లాడుతాడు. దాంతో, రోమ్‌లో ప్రజలంతా అంథోనిపై వ్యతిరేకంగా ఉంటారు. ఈ వ్యతిరేకతే ఈజిప్ట్‌పై దాడికి పురిగొల్పుతుంది. చివరికి, క్లియోపాత్ర అటు, ఆత్మహత్య చేసుకోవడంతో విషాదాంతమవుతుంది.
క్రీస్తు పూర్వానికి చెందిన చరిత్ర అయినా ఇప్పటికీ క్లియోపాత్ర పట్ల ఆదరణ తగ్గలేదు. సమ్మోహన సౌందర్య రాశిగానే కాకుండా ఈజిప్ట్ మహారాణిగా ఆమెకి పేరుంది. క్లియోపాత్ర చుట్టూ అల్లిన కథలెన్నో? షేక్స్ ఫియర్ అంథోని క్లియోపాత్ర పేరుతో విషాదాంత రచన చేసారు. ఆ రచనకు ప్రపంచవ్యాప్తంగా సాహితీ అభిమానులున్నారు.
- పి.వి.డి. ఎస్. ప్రకాష్