కరోనా ప్రభావం తొలుత కనిపించిన చైనాలో పరిస్థితులు మారుతున్నాయి. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడమే కాకుండా సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో చైనాలోని కొన్ని ప్రాంతాల్లో జులై 20 నుంచి థియేటర్లు తెరుచుకున్నాయి. షాంఘై, హాంగ్జోవ్, గుయిలిన్ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో థియేటర్లు ఓపెన్ చేశారు.
మాస్క్లు ధరించడం తప్పనిసరి అనే నిబంధనతో ప్రేక్షకులను థియేటర్లకు అనుమతిస్తున్నారు. వచ్చేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. అలాగే థియేటర్లలో మనిషికి, మనిషికి మధ్య ఓ సీటు ఖాళీ ఉంచుతున్నారు. కొన్ని థియేటర్లలో సీటు ఖాళీగా ఉంచకుండా... మధ్యలో టెడ్డీబేర్లు లాంటివి ఉంచుతున్నారు. కొన్ని చోట్లయితే రెండేసి సీట్లు ఖాళీ ఉంచుతున్నారు. అలాగే ప్రతి షో తర్వాత థియేటర్ను శానిటైజ్ చేస్తున్నారు.
మన దేశంలోనూ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టాక.. ఇలాంటి చర్యలు తీసుకొని థియేటర్లు ఓపెన్ చేస్తారేమో చూడాలి. అక్కడి ప్రేక్షకుల్లాగే మన జనాలు జాగ్రత్తలు పాటించక తప్పదు. అలా కాకుండా ఇప్పుడు మార్కెట్ల దగ్గర భౌతిక దూరం మరచి ఎగబడినట్లు.. థియేటర్ల దగ్గర ప్రవర్తిస్తే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంది.