బాక్సాఫీస్ వద్ద 'సైరా' హంగామాకు త్వరలో తెరలేవబోతుంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసేందుకు చిత్ర బృందం రెడీ అయిపోయింది. ఇప్పటికే టీజర్, ఫస్ట్‌లుక్‌లు నెట్టింట సందడి చేస్తుండగా.. ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. 'సైరా' విడుదల ముందస్తు వేడుకను ఈ నెల 21న కర్నూలులో భారీ ఎత్తున నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అంతేకాదు హైదరాబాద్, విశాఖపట్టణాల్లోనూ కొన్ని ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చూస్తున్నారట.
ప్రీ రిలీజ్ వేడుకను కర్నూలులో ఏర్పాటు చేయడం వెనుక ఓ ఆసక్తికర కారణం ఉందట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టి పెరిగిందంతా రాయలసీమలోనే. స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో భాగంగా కర్నూలు ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నారు. అందుకే ఈ ప్రీరిలీజ్ వేడుకను ఆయన పుట్టిన గడ్డపైనే చేయాలని నిర్ణయించుకుందట చిరు బృందం.
ముందుగా సినిమాలోని ఒక్కొక్క పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చిత్ర యూనిట్ ప్రణాళికలు రచించిందట. తొలుత 'సైరా' టైటిల్ గీతంతో ఈ పాటల ప్రయాణం షురూ కానుందట. దీనికి ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించారట. అయితే ప్రీ రిలీజ్ వేడుకకు అమితాబ్ హాజరు కానున్నారా? లేదా? అన్నది ఇంకా తెలియనప్పటికీ, హైదరాబాద్‌లో జరగబోయే కార్యక్రమానికి ఆయన రానున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి.. మెగాస్టార్ గురించి ఆయన ఉపాధ్యాయుడు ఏమన్నారంటే..?