మెగాస్టార్ చిరంజీవి... తన డ్యాన్స్‌లు, ఫైట్లు, డైలాగ్‌లతో ఆశేషమైన అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఈ కథానాయకుడు నటన తప్ప మిగిలిన విషయాల్లో ఎక్కువగా తలదూర్చడు. అయితే తాను హీరోగా నటించిన 'గ్యాంగ్‌లీడర్'లో కొన్ని కీలక సన్నివేశాలకు దర్శకత్వం వహించాడట చిరు. ఈ విషయాన్ని సీనియర్ నటుడు నారాయణరావు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
"నాకు తెలిసినంత వరకూ చిరంజీవి.. డ్యాన్స్‌లు, ఫైట్లు తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు. కథ విన్నప్పుడే మార్పులు చేర్పులు చెప్పేసేవారు. 'గ్యాంగ్ లీడర్' సినిమా దాదాపు 40శాతం చిరంజీవి రీషూట్ చేశారు. అప్పటివరకూ అతడిలో గొప్ప నటుడున్నాడని మాత్రమే తెలుసు. కానీ ఆయనలోనూ ఓ గొప్ప దర్శకుడున్నాడని అప్పుడర్థమైంది. ఈ విషయం ఎక్కడా ఎవరికీ నేను చెప్పుకోలేదు. ఆ తర్వాత చాలా సార్లు డైరెక్షన్ చేయమని ఆయనకు చెప్పా. తనకు ఇష్టం లేదని చెప్పేవారు చిరు. ఒక విధంగా చెప్పాలంటే తెర మీద పేరు పడని దర్శకుడు చిరు" -నారాయణరావు, సినీ నటుడు.
'గ్యాంగ్‌లీడర్' సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత రషెస్ చూసిన చిరు.. అనుకున్న దానికంటే బాగా రాలేదని నిర్మాత బాపినీడునితో అన్నారట. 'మీరు ఓ చేయి వేస్తే బాగుంటుందని బాపినీడు చిరంజీవిని కోరారు. సినిమాలో 'మురళీమోహన్'ను హత్య చేసే సన్నివేశం, ఆయన స్నేహితులను వెంటాడి చంపే సీన్లకు స్వయంగా మెగాస్టార్ దర్శకత్వం వహించడం విశేషం.
ఇదీ చూడండి : 'సాహో' తర్వాత 'బిగిల్'కే ఆ అవకాశం..!