'కార్తికేయ 2' స్క్రిప్టుకి మరిన్ని మెరుగులు దిద్దుతున్నారా? కొత్త కథ రాసుకుంటున్నారా?
లాక్‌డౌన్ ప్రకటించిన కొత్తలో కొన్నాళ్లపాటు 'కార్తికేయ 2' స్క్రిప్టు పనులే చేశాం. ఇప్పుడు దానికి సంబంధించిన సీజీ పనులపై దృష్టి పెట్టాం. ఇందులో ద్వాపరయుగం నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలుంటాయి. అవి మోషన్ క్యాప్చర్ సాంకేతికతతో త్రీడీలో తీయాల్సిన సన్నివేశాలు. వాటి కోసం ప్రస్తుతం కసరత్తులు సాగుతున్నాయి.
ఇది 'కార్తికేయ'కి కొనసాగింపా, లేదంటే ఫ్రాంచైజీ తరహా చిత్రమా?
పక్కా కొనసాగింపు చిత్రమిది. కథా నాయకుడు, అతని కుటుంబం, స్నేహితులు తొలి సినిమాలో ఉన్నట్లే ఉంటారు. కాకపోతే ఇందులో కథానాయకుడికి ఓ కొత్త సమస్య, కొత్త సవాల్ ఎదురవుతుంది. తొలి సినిమాలో గుడి సమస్య అయితే, ఇందులో అంతకంటే పెద్ద సమస్య. అంతకంటే పెద్ద సాహసం చేయాల్సి వస్తుంది. అదెలా చేశాడు? ఈసారి ఎదురైన సమస్య ఏమిటనేదే ఈ సినిమా.
ఈ కథకి మూలం ఎక్కడిది?
మనం 400, 500 ఏళ్ల కిందటి చరిత్రనే చూస్తాం కానీ... అంతకంటే వెనక్కి వెళితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నమ్మలేని నిజాలు అంటాం కదా అలాంటివి. భూమిపై తొలి శస్త్ర చికిత్స 2 వేల ఏళ్ల కిందట జరిగింది. అది సుషృతుడు అనే భారతీయ వైద్యుడు చేశాడు. ప్రపంచం ఇంకా నాగరికత నేర్వక ముందే, దుస్తులు కూడా సరిగా ధరించడం రాని సమయంలోనే ఆ శస్త్రచికిత్స జరిగింది. అంటే అప్పటికి వాళ్లు ఎంత జ్ఞానం సంపాదించి ఉండాలి? ఎంత సాంకేతికత, ఎంత కమ్యూనికేషన్ ఉంటే వాళ్లు అప్పట్లో శస్త్రచికిత్స చేసుంటారు. అది చాలా ఆసక్తి రేకెత్తించింది. కాలం గడిచేకొద్దీ అప్పటి జ్ఞానసంపద, సాంకేతికత నిర్లక్ష్యానికి గురైంది. ఆ అంశాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న చిత్రమిది. కథానాయకుడికి ఎదురైన సమస్య, అతని పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.
మీ కథల్లో థ్రిల్లర్ కోణమే కనిపిస్తుంటుంది. ఆ కథలంటే ఇష్టమా?
నాకు అన్నీ చేయాలని ఉంది. ఓ ప్రేక్షకుడిగా అన్ని రకాల సినిమాల్నీ ఇష్టపడతా. కాకపోతే రాసుకోవడానికీ కానీ, చెప్పడానికి కానీ... కథలో సస్పెన్స్ అంశాలు ఉండాలనుకుంటాను. అప్పుడే రాసేటప్పుడు కానీ, తీసేటప్పుడు కానీ మంచి కిక్ వస్తుంది.
రచయితగా, దర్శకుడిగా మీపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది?
మంచి సినిమా ఎవరు తీసినా వాళ్లు బాగా నచ్చేస్తుంటారు. ఎవరిలా పేరు తెచ్చుకోవాలని అడిగితే... అత్యాశే అయినా సుకుమార్‌లాగా అని చెబుతాను. ప్రతిసారీ ఆశ్చర్యపరిచే దర్శకుడాయన. నేనెక్కువగా చూసేది రాజమౌళి సినిమాల్ని. ఈ పది రోజులు సినిమాలు చూస్తూ గడపాలనుకుంటే, ఆ పది రోజులూ ఏదో ఒక సందర్భంలో 'బాహుబలి' సినిమా చూస్తానంతే. ఆయన సినిమాలంటే అంతిష్టం.
పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటారా?
ఇదివరకు చదివేవాణ్ని. ఇప్పుడు పుస్తకాల కంటే ఎక్కువగా అధ్యయనం చేస్తుంటా. ఏదైనా ఒక విషయం ఆసక్తిని రేకెత్తిస్తే దాని గురించి లోతుగా అన్వేషిస్తుంటా. రామాయణం, భాగవతం, అమరచిత్ర కథలంటే ఇష్టం.
శర్వానంద్‌తో ప్రేమకథ తీయబోతున్నారని తెలిసింది. అదెలా ఉండబోతోంది?
‘కార్తికేయ2’ కంటే ముందే తీయాల్సిన సినిమా అది. 1910 నుంచి 2021 వరకు జరిగే ప్రేమకథ. ముగ్గురు నాయికలుంటారు. ‘మనం’ తరహాలో ఎప్పటికీ గుర్తు పెట్టుకునే ఓ మంచి సినిమా అవుతుంది. అయితే మేం చిత్రీకరణ మొదలు పెట్టే క్రమంలోనే శర్వానంద్ గాయపడ్డారు. శారీరకంగా శ్రమించి చేయాల్సిన పాత్ర అది. దాంతో శర్వా మొదట నేను 'జాను' చేస్తా, ఆ తర్వాత చేద్దాం అన్నారు. ఆలోపు నేను 'కార్తికేయ2' పూర్తి చేయొచ్చు కదా అని దీనిపై దృష్టి పెట్టా. దీని తర్వాత శర్వానంద్‌తోనే సినిమా ఉంటుంది. ఆ తర్వాత గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా ఉంటుంది.
నిఖిల్, నేను, సుధీర్‌వర్మ ఒకేసారి పరిశ్రమకి వచ్చాం. అప్పుడు నిఖిల్ ఓ సినిమాలో చిన్న పాత్ర చేస్తున్నాడు. అప్పుడే మేం ఒక నిర్ణయం తీసుకున్నాం. నువ్వు హీరో అయితే మమ్మల్ని దర్శకుల్ని చేయాలి, మేం దర్శకులైతే నిన్ను హీరో చేస్తామని. తను హీరో కాకపోతే మాత్రం నేను దర్శకుణ్ని అయ్యేవాణ్నే కాదు. నిఖిల్, కార్తీక్ ఘట్టమనేని నాకు బాగా సన్నిహితులు. వాళ్లతో ఉన్న అనుబంధం వల్లే నేను ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలకి మాటలు రాశా. ఓటీటీ వేదికల కోసం సినిమాల్ని కానీ, వెబ్ సిరీస్‌ల్ని కానీ చేయకపోతే ఒక వర్గం ప్రేక్షకులకి దూరమైనట్టే. అందుకే భవిష్యత్తులో కచ్చితంగా వెబ్ సిరీస్‌లు చేస్తా. అందుకోసం నేను, మా బృందం కలిసి కొన్ని కథలు కూడా సిద్ధం చేసుకున్నాం.
విభిన్నమైన కాన్సెప్ట్ రాసుకుంటే, దాన్ని అంతే భిన్నంగా తీయాలి. వాణిజ్యాంశాల పేరుతో ఇతర హంగుల్ని జోడించాక... అవి సరిగ్గా కుదరకపోతే ఫలితం తారుమారవుతుంది. ‘సవ్యసాచి’ విషయంలో అదే జరిగింది. దర్శకుడిగా నేను తీసుకున్న నిర్ణయంలోనే తప్పులు జరిగాయి. నేనూ, నాగచైతన్య ఇద్దరం నిరుత్సాహానికి గురయ్యాం. కానీ నాగచైతన్య ఇప్పటికీ వెన్ను తడుతున్నారు. ‘కార్తికేయ2’ ప్రచార చిత్రం చూశాక ‘ఈ సినిమాతో నువ్వు కొట్టాలి. నువ్వు హిట్టు కొడితే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సంతోషించేది నేనే’ అని సందేశం పంపారు.