వినోదమంటే కొన్నాళ్ల క్రితం వరకు అందరి కళ్లూ థియేటర్ల వైపే చూసేవి. ఇప్పుడీ వెండితెర వినోదాలకు ఓటీటీ వేదికలు, డిజిటల్ మాధ్యమాలు మంచి ప్రత్యామ్నాయాలుగా మారాయి. కరోనా పరిస్థితుల తర్వాత పెద్ద చిత్రాలు సైతం ఓటీటీ బాట పట్టడం వల్ల.. ఈ వేదికలకు ఆదరణ మరింత పెరిగింది. ఈ ఆదరణ ఎంత ఉన్నా.. అదే స్థాయిలో విమర్శలూ ఉన్నాయి. ఈ వేదికల కోసం ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ, దీంట్లో ప్రసారమయ్యే వెబ్ కంటెంట్‌కు సెన్సార్ లేకపోవడం వల్ల.. అశ్లీల కంటెంట్‌కు ఓటీటీలు నిలయాలుగా మారాయనేది పలువురి వాదన. ఈ నేపథ్యంలోనే ఈ డిజిటల్ వేదికల్ని నియంత్రించేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. డిజిటల్ మీడియా మొత్తాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో.. త్వరలో ఓటీటీ కంటెంట్‌కూ సెన్సార్ కత్తెర తప్పదని అర్థమవుతోంది. ఇదే జరిగితే.. ఇకపై ఈ సంస్థలన్నీ సెన్సార్ చేసిన కంటెంట్‌నే కొనుక్కోవాల్సి వస్తుంది.
అయితే, వీటిపై నియంత్రణ ఎలా ఉంటుంది? నిర్దిష్ట మార్గదర్శకాలు ఉంటాయా? ప్రత్యేక సంస్థ ఏర్పాటు ఉంటుందా? అన్నది స్పష్టత ఇవ్వలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ఇప్పటికే చాలా మంది నిర్మాతలు, దర్శకులు, రచయితలు, కథనాయకులు, నాయికలు ఓటీటీ బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే వెబ్ కంటెంట్ సెన్సార్‌పై చిత్ర సీమలోనూ చర్చ మొదలైంది.
గతంలో దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ.. "ఓటీటీ కంటెంట్‌ను సెన్సార్ పరిధిలోకి తీసుకురావాలని అందరూ అంటున్నారు. అది జరిగే పని కాదు. ఇప్పుడు అనేక దేశాల నుంచి ఇన్ని ఓటీటీ వేదికలు వస్తున్నప్పుడు.. వాటిలో వచ్చే కంటెంట్ మొత్తాన్ని సెన్సార్ చేయడం అసాధ్యం. దీనికోసం ఎన్ని సెన్సార్ బోర్డు ఆఫీసుల్ని ఏర్పాటు చేస్తారు? గ్లోబల్‌గా అందరం ఒకటిగా కనెక్ట్ అయిపోయి ఉన్నప్పుడు ఐదారుగురు కూర్చోని.. ఎవరేం చూడొచ్చో, ఏం చూడకూడదు? అని ఎలా నిర్ణయిస్తారు" అని చెప్పుకొచ్చారు.
స్పష్టత రావాలి
ఈ విషయంపై గురువారం దర్శకుడు సంకల్ప్‌రెడ్డి తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. "రెండున్నర గంటల సినిమాను పూర్తిగా చూసి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికే రోజుల తరబడి సమయం పడుతుంది. అలాంటిది పది, పన్నెండు గంటల నిడివి ఉండే వెబ్‌సిరీస్‌లను పూర్తిగా చూసి సెన్సార్ చేయడమంటే ఇంకెంత సమయం పట్టాలి. వీటిపై ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. నాకు తెలిసి.. మత విద్వేషాల్ని రెచ్చగొట్టే అంశాలు, దేశ భద్రతకు సంబంధించిన విషయాలున్న కంటెంట్‌పై సెన్సార్ విధించే ప్రయత్నం చేస్తారేమో చూడాలి" అన్నారు.
కళకు సెన్సార్ ఏంటి?
"కళను సెన్సార్ చేయాలన్న మాటను నేను నమ్మను. నేనొక ఫిల్మ్ మేకర్‌గా ఒక అంశాన్ని నాదైన కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకవేళ ప్రభుత్వం 'ఇది మీరు చూపించకూడదు' అని చెప్తే.. దానిపై పోరాడతా. దాన్ని అలా తీయడం వెనకున్న సదుద్దేశాన్ని ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తా. దీనికోసమే ట్రిబ్యునల్స్ ఉన్నాయి. నెక్ట్స్ లెవల్ సెన్సార్‌లు ఉన్నాయి. ఒకవేళ అక్కడా వద్దు అన్నారు అంటే.. ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సిందే. దేశ పౌరుడిగా మన చట్టాల్ని గౌరవించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ సెన్సార్ షిప్ ఏదైనా సరే.. ఏది కంటెంట్‌కు అవసరమో, ఏది అవసరం లేదో.. స్పష్టంగా విడదీసి చూడగలిగినప్పుడు అమోదయోగ్యంగా ఉంటుంద'ని అభిప్రాయ పడ్డారు దర్శకుడు కరుణ కుమార్.
ఇదీ చూడండి : తేనెల పాటల 'కోకిల'.. ఈ గాన సుశీల