కరోనా కారణంగా అన్ని సినిమా , టీవీ కార్యక్రమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. నటీనటులు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. నిర్మాతలు నష్టాల బారిన పడ్డారు. దీనిపై ఇప్పటికే పలు సినీ ఇండస్ట్రీలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విన్నవించాయి. సాధ్యమైనంత త్వరగా చిత్రీకరణలకు అవకాశం ఇవ్వాలని కోరాయి. దేశంలో మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా ఆలోచనలో పడ్డ కేంద్రం ఎట్టకేలకు షూటింగ్స్‌కు అనుమతిచ్చింది. అన్ని జాగ్రత్తలను పాటిస్తూ చిత్రీకరణలు జరుపుకోవాలని సూచించింది.
తాజాగా షూటింగ్‌లకు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ విడుదల చేశారు. అందరూ కచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలన్న షరతును విధించారు. కెమెరా ముందు నటించే వారికి మాత్రం దాని నుంచి మినహాయింపు ఇచ్చారు.