బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్(98) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ఇటీవల ఆస్పత్రిలో చేరారు. ముంబయి హిందూజ ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస(Dilip Kumar Died) విడిచారు.
దిలీప్‌కుమార్ మరణ వార్తతో బీటౌన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ తారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంటాక్రూజ్ ముంబయిలోని జుహు కబ్రాస్థాన్లో బుధవారం సాయంత్రం 5 గంటలకు దిలీప్ కుమార్‌కు అంత్రక్రియలు నిర్వహించనున్నారు.
వ్యక్తిగతం
దిలీప్‌కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. 1922 డిసెంబరు 11న పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆయన జన్మించారు. సినిమాల్లోకి రాకముందు తండ్రితో కలిసి పండ్లు అమ్మేవారు. బాంబే టాకీస్ యజమాని యూసుఫ్ ఖాన్‌కు దిలీప్‌కుమార్ పేరు పెట్టారు. 1944లో 'జ్వర్ భాతా' చిత్రంతో దిలీప్ కుమార్ సినీరంగ ప్రవేశం చేశారు.
1955లో విడుదల 'దేవదాస్' చిత్రంతో దిలీప్‌కుమార్‌కు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆయన హీరోగా 1955లో వచ్చిన 'ఆజాద్' దశాబ్దిలో అధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సాధించింది. ఆ తర్వాత 1944 నుంచి 1998 వరకు నటుడిగా చిత్రసీమను ఏలారు దిలీప్‌కుమార్. నటి సైరా భానును 1966లో ఆయన వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1980లో అస్మాను రెండో పెళ్లి చేసుకున్నారు. దిలీప్ కుమార్ చివరిగా 'ఖిలా'(1998) అనే చిత్రంలో నటించారు.
దిలీప్ కుమార్‌ను వరించిన పురస్కారాలు..
- ఉత్తమ నటుడిగా 8 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు.
- 1994లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
- 2015లో దిలీప్‌కుమార్‌ను వరించిన పద్మవిభూషణ్ పురస్కారం.
- 1991లో పద్మభూషణ్‌తో దిలీప్ కుమార్‌ను సత్కరించిన కేంద్రం.
- 1993లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ పురస్కారం.
- 1998లో దిలీప్‌ను నిషాన్-ఇ-ఇంతియాజ్ అవార్డుతో సత్కరించిన పాకిస్థాన్ ప్రభుత్వం.
- 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగా దిలీప్‌కుమార్ సేవలు.
ఇదీ చూడండి.. Dilip kumar: దిలీప్ కుమార్ ఇంకా ఆక్సిజన్ సపోర్ట్‌పైనే