"నేను నీకంటే పెద్ద స్టార్‌ను, నేను వస్తుంటే నిలబడటం తెలియదా?", "నువ్వ నా ఆశీర్వాదం తీసుకోలేదు" లాంటివి బాలీవుడ్లో ఎక్కువని చెప్పారు సీనియర్ నటుడు-సంగీత దర్శకుడు-రచయిత పియూష్ మిశ్రా. ఇండస్ట్రీలో నెపోటిజమ్ కంటే దాదాగిరి చేయడం ఎక్కువని తెలిపారు. తనకు మాత్రం అలాంటి సందర్భాలు ఎదురుకాలేదని వెల్లడించారు.
"నెపోటిజమ్ గురించి నేను ఆలోచించను. ఒకవేళ అది ఉన్నా నా ఎదుగుదలను ఆపలేదు, నా పనికి ఆటంకం కలిగించలేదు. నేను తెలివితక్కువ పనిచేస్తే తప్ప నన్ను ఇబ్బంది పెట్టడం సాధ్యపడదు. గతంలో కాంట్రాక్ట్‌లు సరిగా చూడకపోవడం వల్ల రెండుసార్లు ఇలానే ఇబ్బందిపడ్డాను. ఇప్పుడిలా ఉన్నానంటే దానికి కారణం నా కృషితో పాటు ప్రేక్షకుల అంగీకారం కూడా ఉంది. నెపోటిజమ్ గురించి నాకైతే తెలియదు. కానీ బాలీవుడ్లో దాదాగిరి చాలా ఎక్కువగా ఉంది. నేను పెద్ద స్టార్‌ను, నా అశీర్వాదం తీసుకోలేదు, నేను వచ్చినప్పుడు నువ్వు నిలబడలేదు లాంటి మాటలు చాలా వినిపిస్తుంటాయి"
-పియూష్ మిశ్రా, సీనియర్ నటుడు
తమ వారసులు వృద్ధి కోసం ఏ తల్లిదండ్రులైనా సరే ఆలోచిస్తారని పియూష్ అన్నారు. కానీ ఓ నటుడు కుమారుడు/కుమార్తె నటుడే కావాలని అనుకోవడం సరికాదని, వాళ్లకు రెడీమేడ్ కెరీర్ ఇవ్వడం పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. అలా ఇండస్ట్రీకి వచ్చి, తమ తండ్రులపై ఉన్న అంచనాలు అందుకోలేక చతికిలపడిన నటీనటులు చాలామంది ఉన్నారని గుర్తుచేశారు. హిందీలోని 'మక్బూల్', 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్', 'పింక్' సినిమాలతో అలరించిన ఈయన తెలుగులో నాగార్జున 'సూపర్'లోనూ నటించారు.