బాలీవుడ్ దర్శకుడు, నటుడు నిషికాంత్ కామత్ కన్నుమూశారు. తీవ్ర జ్వరం, ఆయాసంతో బాధపడుతూ గత నెల 31న ఏఐజీ (ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ)లో చేరారు. ఆయన రెండేళ్లుగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. దీంతో వైద్యులు ఆయన చికిత్స చేయడం మొదలుపెట్టారు. ఇటీవల నిషికాంత్ కోలుకున్నట్లు కనిపించారు. అయితే, సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిన కారణంగా తుది శ్వాస విడిచారని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వివిధ అవయవాలు పనిచేయకపోవడం వల్ల ఆయన కన్నుమూసినట్లు వైద్య నిపుణులు తెలిపారు.
ఈ రోజు మధ్యాహ్నం నిషికాంత్ చనిపోయినట్లు వార్తలు రావడంతో ఆయన స్నేహితుడు, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ వాటిని ఖండించారు. ఆయన చనిపోలేదని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్నారు. అయితే కొద్దిసేపటికే నిషికాంత్ కన్నుమూయడంతో రితేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "నా ప్రియమైన స్నేహితుడిని కోల్పోతున్నా. నిషికాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి" అని ట్వీట్ చేశారు.
నిషికాంత్ మృతిపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా విచారం వ్యక్తం చేశారు. "కేవలం 'దృశ్యం' చిత్రంతోనే మా ఇద్దరి స్నేహాన్ని సరిచూడలేను. ఆయన నన్ను, టబును కలిపి అద్భుతంగా ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన తెలివైన వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతుంటారు. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. నిషికాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి" అని అజయ్ ట్వీట్ చేశారు.
బాలీవుడ్‌లో వచ్చిన ‘దృశ్యం’, ‘మదారి’, ‘ముంబయి మేరీ జాన్’ తదితర చిత్రాలకు నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించారు. అంతేకాకుండా పలు మరాఠీ చిత్రాల్లో నటించారు. 2005లో ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన ‘డాంబివాలీ’ మరాఠీ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.