"ఓ సినిమా చేయాలంటే స్క్రిప్ట్ బాగుండాలి. ఆ కథను సమర్థంగా తెరకెక్కించగల దర్శకుడు దొరకాలి. ప్రతిభావంతులైన నటీనటులు కావాలి. ఇవన్నీ సరిగ్గా కుదిరిన చిత్రమే 'మోసగాళ్ళు" అన్నారు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. మంచు విష్ణు హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రమిది. సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు సునీల్ శెట్టి.
- "హాలీవుడ్ స్టాండర్డ్స్ ఉన్న చిత్రమిది. ముంబయిలోని అక్కాతమ్ముడు కలిసి.. అమెరికాలో ఓ భారీ కుంభకోణానికి పాల్పడటం నన్ను ఆకట్టుకుంది. వారిని పట్టుకునే పోలీస్ అధికారిగా నేను కనిపిస్తా. ఈ దొంగ.. పోలీస్ ఆటలో ఆఖరికి ఎవరిదిపై చేయి అయిందన్నది మిగతా కథ".
- "దక్షిణాది పరిశ్రమలో ఓ గొప్పదనం ఉంది. షూటింగ్ చేయడం, తినడం, ప్యాకప్ చెప్పడం.. ఇలా ప్రతి ఒక్కటీ టైం ప్రకారం జరిగిపోతుంటాయి. హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పుడే నాకు ఓ రకమైన మంచి అనుభూతి కలిగింది. దీన్ని తొలుత ఇంగ్లీష్‌లోనే షూట్ చేశాం. తర్వాత తెలుగు, హిందీ వెర్షన్‌లలో తెరకెక్కించాం. ఇలా వేర్వేరు భాషల్లో చేయడం కష్టతరమైన పని. కానీ, అందరం మా వంతు ప్రయత్నం చేశాం".
- "ప్రస్తుతం నేను తెలుగులో వరుణ్ తేజ్‌తో 'గని' చిత్రంలో నటిస్తున్నా. అది చాలా అద్భుతంగా ఉండనుంది. ఆ సినిమా కోసం నేను మళ్లీ శరీరాకృతిని మార్చాల్సి ఉంది".
ఇదీ చూడండి: ఈ సినిమా వదులుకోకూడదు అనుకున్నా: కార్తికేయ