మన ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకుంటాం. అందులో కుక్కలు, పిల్లులు, చిలకలు ఇలాంటివెన్నో ఉంటాయి. వీటితో అనుబంధాన్ని ఏర్పరుచుకుంటాం. అయితే మొక్కలు, చెట్లతోనూ మనిషికి రిలేషన్ ఉంటుందని చరిత్రలో విన్నాం. ఇదే విషయాన్ని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కళ్లకు కట్టినట్లు చూపించారు.
దాదాపు 43 ఏళ్ల పాటు ఓ చెట్టుతో స్నేహం చేశారు అమితాబ్. తన బంగ్లాలో నాలుగు దశాబ్దాల క్రితం గుల్మోహర్ చెట్టును నాటారు. ఈ మధ్య కురిసిన వర్షాలకు అది నేలకొరిగింది. ఈ సందర్భంగా ఆ చెట్టుతో తనకున్న అనుబంధాన్ని అమితాబ్, సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.
"మా ఇంట్లోని ఈ చెట్టు 43 సంవత్సరాలుగా మా జీవితంలో భాగమైంది. 1976లో మొక్కగా నాటాం. ఇప్పటి వరకు దాని చుట్టూ ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. మా పిల్లలంతా చెట్టు చూట్టూ తిరిగి ఆడుకునేవారు. మా మనవరాళ్ల పుట్టినరోజులు, ప్రతి పండగలు, ఉత్సవాలకు అది నిలువెత్తు నిదర్శనం. సత్యనారాయణ వ్రతాలకు, ప్రతి కొత్త ఆనందానికి గుల్మోహర్ చెట్టును అందంగా అలంకరించేవాళ్లం. వేసవిలో అది పూచే పూలను చూసి ఎంతో ఆనందించే వాళ్లం. దాని ప్రకాశవంతమైన నారింజ పువ్వులతో ఎంతో అందంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు స్వచ్ఛందగా ఒరిగిపోయింది" -అమితాబ్ బచ్చన్, సినీ నటుడు
ఇదీ చూడండి:భారత్-చైనా వివాదం.. ఆమిర్ షూటింగ్ వాయిదా!