నితిన్ విజయాల బాట పట్టినట్టే పట్టి మళ్లీ పరాజయాల్లో కూరుకుపోయాడు. 'అఆ' చిత్రంతో కథానాయకుడిగా ఈ హీరో స్థాయి పెరిగిపోయింది. మరో దశలోకి అతడి కెరీర్ వెళుతుందని ఆశపడ్డారంతా. కానీ ఆ తర్వాత నటించిన 'లై', 'చల్ మోహన్ రంగా', 'శ్రీనివాసకళ్యాణం'తో నితిన్ వరుస పరాజయాల్ని చవిచూడాల్సి వచ్చింది. విజయం అత్యవసరం అన్న పరిస్థితుల్లో ఏడాదిపాటు విరామం తీసుకుని 'భీష్మ' కోసం రంగంలోకి దిగాడు. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తించాయి. నితిన్ కూడా 'దిల్', 'సై' తర్వాత మళ్లీ అలాంటి మాస్ అంశాలున్న సినిమా ఇదే అంటూ అంచనాల్ని పెంచాడు. మరి చిత్రం ఎలా ఉంది? నితిన్‌కి విజయం దక్కినట్టేనా? తదితర విషయాల్ని తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం..
కథేంటంటే: ఎనిమిది వేల కోట్ల విలువ చేసే భీష్మ ఆర్గానిక్స్ కంపెనీ అధిపతి భీష్మ (అనంతనాగ్). తన కంపెనీకి కొత్త సీఈఓని నియమించే పనిలో ఉంటాడు. అర్హతలకన్నా కూడా నాణ్యమైన వ్యక్తి అయితేనే తన సంస్థ లక్ష్యాలను నెరవేర్చుతాడనేది భీష్మ ఆలోచన. చాలా మంది ఆ స్థానం కోసం పోటీ పడుతుండగా.. ఎవరూ ఊహించని రీతిలో డిగ్రీ కూడా పాస్ కాని భీష్మ(నితిన్) ముప్పై రోజులపాటు ఆ కంపెనీకి సీఈఓగా ఎంపికవుతాడు. ఇంతకీ ఆ భీష్మకీ, ఈ భీష్మకీ మధ్య సంబంధమేమిటి? సీఈఓ స్థానంలో కూర్చున్న ముప్పై రోజుల్లో జూనియర్ భీష్మ ఏంచేశాడు? ఛైత్ర (రష్మిక)తో ఎలా ప్రేమలో పడ్డాడు? వాళ్ల ప్రేమకథ కంచికి చేరిందా లేదా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: సేంద్రీయ వ్యవసాయం అనే నేపథ్యం మినహా కథ సాధారణమైనదే. కానీ ఆ కథకే తగినన్ని మలుపులు, సందర్భోచితంగా పండే హాస్యాన్ని జోడించి చిత్రాన్ని తీర్చిదిద్దారు. కథ చూసిందే కదా అనే విషయాన్ని కూడా గుర్తురానీయకుండా తరచూ నవ్విస్తుంటాయి పాత్రలు. దర్శకుడు తన తొలి సినిమాతోనే కథలో హాస్యాన్ని మేళవించడంపై తనకి మంచి పట్టుందని నిరూపించాడు. మరోసారి తన బలాన్నే వాడుకుని చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ద్వితీయార్ధంలో కొన్నిచోట్ల సాగదీతలా అనిపిస్తుంది తప్ప మిగతా సినిమా అంతా కూడా హాస్యంతో మంచి కాలక్షేపాన్నిస్తుంది. హీరో పాత్ర సగటు తెలుగు సినిమాల్లోలాగే ఉంటుంది. ఆరంభ సన్నివేశాలు సాధారణంగానే అనిపిస్తాయి. నితిన్, వెన్నెల కిషోర్ కలిసినప్పట్నుంచి సినిమాలో సందడి పెరుగుతుంది. ఏసీపీకి సహాయకుడిగా ఉంటూ.. హీరోయిన్ మనసు దోచుకునేందుకు ప్రయత్నించడం, ఆ తర్వాత ఆమెతో ప్రేమ మొదలవడంలాంటి సన్నివేశాలతో సినిమా వేగంగా సాగుతుంది. విరామ సమయంలో వచ్చే మలుపు ఆకట్టుకుంటుంది. అది ఒకెత్తు అనుకుంటే, విరామం తర్వాత మలుపు మరో ఎత్తు. ఆ మలుపుల నుంచే వినోదం రాబట్టాడు దర్శకుడు. ద్వితీయార్ధంలో కంపెనీకి సీఈఓగా ఎంపికవడం, ఆ తర్వాత అతనికి ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించే తీరు ఆకట్టుకుంటాయి. హాస్యం వరకు ఓకే కానీ, ప్రతినాయక పాత్రలో బలం లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. సంపత్, జిషుసేన్ గుప్తాలాంటి నటులున్నప్పటికీ.. సంపత్‌ని కూడా ఇందులో కామెడీ కోసమే ఉపయోగించుకున్నారు. ఇక జిషుసేన్ గుప్తా పాత్రలో బలం లేదు. దాంతో హీరో, విలన్ మధ్య పోరు అంత ఆసక్తికరంగా ఏమీ అనిపించదు. భావోద్వేగాలకి కూడా చోటులేదు. దాంతో రెండున్నర గంటలు కాలక్షేపాన్నిచ్చే ఒక సగటు సినిమాలా మారిపోయింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎవరెలా చేశారంటే: నితిన్, రష్మిక మంచి అభినయం ప్రదర్శించారు. వాళ్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. నితిన్ తన పాత్రలో ఒదిగిపోయాడు. రష్మిక అందంగా కనిపిస్తూ, చక్కటి హావభావాలు పలికించింది. వెన్నెల కిషోర్ పరిమిళ్ అనే పాత్రలో బాగా నవ్వించాడు. రఘుబాబు, బ్రహ్మాజీ, నరేష్, సంపత్ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. జిషుసేన్ గుప్తా ప్రతినాయకుడిగా కనిపిస్తాడు. కానీ ఆ పాత్రలో పెద్దగా బలం లేదు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సాయిశ్రీరామ్ కెమెరా పనితనం, మహతి స్వరసాగర్ సంగీతం అలరిస్తుంది. వెంకీ కుడుముల మాటలు, కథనం పరంగా మెప్పిస్తాడు. త్రివిక్రమ్ దగ్గర శిష్యరికం చేసిన వెంకీ చాలా సన్నివేశాల్లో తన గురువు సినిమాల్ని గుర్తు చేశాడు.
బలాలు
హాస్యం
నితిన్, రష్మిక అభినయం
కథలో మలుపులు
బలహీనతలు
భావోద్వేగాలకి చోటు లేకపోవడం
చివరిగా: ఈ 'భీష్మ' నవ్విస్తాడు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!!
ఇదీ చూడండి : రామ్‌చరణ్‌కు ఆ 'డ్రైవింగ్ లైసెన్స్'తో సంబంధం లేదట!