బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’. రోజా కథానాయిక. కె.ఆర్.విజయ, విజయ్ కుమార్, బాబూమోహన్, సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో మాంత్రికుడిగా విజయరంగరాజు కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రంలో బేతాళ మాంత్రికుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పెద్ద కసరత్తు జరిగింది.
భిన్నంగా కథ..
దివంగత నటుడు, రచయిత రావి కొండలరావు ఈ చిత్రానికి కథ అందించారు. అంతకు ముందు విజయా సంస్థలో ‘బృందావనం’ తీసి మంచి విజయాన్ని అందించిన సింగీతం శ్రీనివాసరావుకు చిత్ర నిర్మాణ సంస్థ దర్శకత్వం బాధ్యతలు అప్పగించింది. ‘పాతాళభైరవి’ వంటి జానపద కథ కన్నా కాస్త భిన్నంగా ఉండాలని కొత్త మలుపులతో సినిమా కథను సిద్ధం చేశారు రావి కొండలరావు. కథ విన్న వెంటనే బాలకృష్ణ కూడా ఒప్పుకొన్నారు. పైగా తన తండ్రి నటించిన ‘పాతాళ భైరవి’ శైలిలో కథ, కథనాలు ఉండటం ఆయనకు నచ్చింది. కథానాయికగా అప్పటికి ట్రెండ్‌లో కొనసాగుతున్న రోజాను తీసుకున్నారు.
బాలకృష్ణ తల్లిగా కె.ఆర్. విజయ, తండ్రిగా విజయకుమార్, రోజా తల్లిదండ్రులుగా సంగీత, కైకాల సత్యనారాయణ, బాలకృష్ణ పెంపుడు తల్లిగా రాధాకుమారి, తండ్రిగా భీమేశ్వరరావు, బాలకృష్ణ తమ్ముడుగా బాబూమోహన్, గురువుగా మిక్కిలినేని, యక్షిణి ప్రత్యేకపాత్రలో రంభలు ఎంపికయ్యారు. పద్మనాభం, సుత్తివేలు అతిథి పాత్రలు పోషించారు. హాస్య పాత్రల్లో గిరిబాబు, శుభలేఖ సుధాకర్ నటించగా మరుగుజ్జు మనుషులుగా మాస్టర్ విశ్వేశ్వరరావు, చిట్టిబాబులు కనిపించారు.
విలన్ కోసం నానాపటేకర్, అమ్రిష్ పూరి
అయితే, బేతాళ మాంత్రికుడు వంటి విలన్ పాత్రకు ఎస్.వి. రంగారావులాంటి నటుడైతే బాగుంటుందని చిత్ర బృందం భావించి అన్వేషణ మొదలు పెట్టింది. హిందీ నటులు నానాపటేకర్, అమ్రిష్ పూరి కూడా పరిశీలించిన జాబితాలో ఉన్నారు. అప్పుడే ‘వియత్నాం కాలనీ’ అనే మలయాళ సినిమా మద్రాసులో విడుదలయితే ఆ చిత్రాన్ని నిర్మాత వెంకటరామరెడ్డి చూశారు. అందులో నటించిన రాజకుమార్ అనే నటుడి మీద నిర్మాతకు గురి కుదిరింది. పైగా ఆ నటుడు తెలుగువాడని కూడా తెలియడంతో అతణ్ణి మాంత్రికుని వేషానికి ఎంపిక చేశారు. అతనికి ‘విజయా’ సంస్థ పేరు, ఎస్.వి. రంగారావు పేరు కలిసి వచ్చేలా ‘విజయ రంగ రాజా’ అనే పేరు పెట్టి ‘భైరవద్వీపం’లో విలన్‌గా పరిచయం చేశారు.
ప్రారంభ వేడుకకు చిరంజీవి, రజనీకాంత్..
ఇక ఛాయాగ్రహణం విషయానికి వస్తే ట్రిక్ షాట్లువంటివి తీయడంలో నిష్ణాతుడైన ఎస్.ఎస్.లాల్ కుమారుడు సయ్యద్ కబీర్‌లాల్‌ను తీసుకున్నారు. కబీర్ లాల్ అంతకుముందు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘ఆదిత్య 369’ చిత్రానికి పనిచేశారు. 1993 జూన్ 25 న మద్రాసు వాహినీ స్టూడియోలో భారీగా నిర్మించిన సెట్టింగులో సినిమా ప్రారంభ వేడుక నిర్వహించారు. ముహూర్తపు షాట్ బాలకృష్ణ, రోజాలమీద చిత్రీకరించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ క్లాప్ ఇవ్వగా, మెగాస్టార్ చిరంజీవి స్విచ్ ఆన్ చేశారు. ఎన్టీ రామారావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ముహూర్తం అవగానే రంభ, బాలకృష్ణల మీద ‘నరుడా ఓ నరుడా ఏమి కోరిక’ పాట చిత్రీకరించారు. 1994 ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.
ఇదీ చూడండి:'హీరో'గా మహేశ్ మేనల్లుడు.. కొత్త సినిమాతో కార్తిక్ ఆర్యన్