పశ్చిమ బంగాకు చెందిన ఓ టీవీ నటి.. తనపై అత్యాచారం జరిగిందని పోలీసులను ఆశ్రయించింది. పరిచయస్తుడైన యువకుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు జులై 8న నమోదైన ఫిర్యాదులో పేర్కొంది. 'సాత్ బాయ్ చంపా' అనే ధారావాహికలో ఈమె ఓ కీలకపాత్రలో నటిస్తోంది.
చరవాణిలో వీడియో
బాధిత నటికి తెలిసిన ఓ యువకుడు.. జులై 5న అప్పు కోసం ఆమె నివాసానికి వచ్చాడు. ఈ క్రమంలోనే ఒంటరిగా ఉన్న ఆ మహిళపై అత్యాచారం చేసి, తన చరవాణిలో వీడియో తీసినట్లు వెల్లడించింది. పోలీసులకు చెప్తే సదరు వీడియోను ఇంటర్నెట్లో పెడతానని ఆమెను బెదిరించినట్లు పేర్కొంది. దీంతో బాధితురాలు జాదవ్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
కలవాలని ఒత్తిడి
బాధితురాలు పశ్చిమ బంగాలోని నడియా జిల్లాకు చెందిన ఈ యువతి.. వృత్తిలో భాగంగా మోడలింగ్ నేర్చుకుంటూ కోల్కతాలో ఒంటరిగా ఉంటుంది. తనపై అత్యాచారం చేసిన అతడితో ఆమెకు ఇదివరకే పరిచయం ఉంది. నిందితుడు లాక్డౌన్ మొదలైనప్పటి నుంచే తనను కలవాలమని ఒత్తిడి చేసేవాడని.. దానికి తను అంగీకరించలేదని ఆమె తెలిపింది. తన వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల అప్పు అడిగేందుకు వచ్చిన అతడు, ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని పేర్కొంది.