ప్రముఖ చిత్ర నిర్మాత రిడ్లే స్కాట్ నిర్మించనున్న 'ద లాస్ట్ డ్యూయల్' చిత్రంలో బెన్ అఫ్లెక్, మాట్ డామన్ కలిసి నటించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గుడ్ విల్ హంటింగ్' చిత్రంలో ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ కూడా గెలుచుకున్నారు. 'కెన్ యు ఎవర్ ఫర్గివ్ మీ?' ఫేం రచయిత్రి నికోలే హోలోఫ్సెనర్ ఈ కొత్త చిత్రానికి రచనా సహకారం అందించనుంది.
ఎరిక్ జాగర్ రాసిన పుస్తకం 'ద లాస్ట్ డ్యూయల్: ఎ ట్రూ స్టోరీ ఆఫ్ క్రైమ్, స్కాండల్ అండ్ ట్రయల్ బై కంబాట్ ఇన్ మిడీవల్ ఫ్రాన్స్' ఆధారంగా సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. 14 శతాబ్దంలో ఫ్రాన్స్‌లో ఇద్దరు యోధుల మధ్య జరిగిన యుద్ధం దీని కథాంశం.
యుద్ధానికి వెళ్లిన ఓ సైనికుడి భార్యపై అతడి స్నేహితుడే అత్యాచారం చేస్తాడు. ఆ ఘటనపై ఆమె ఎవరికి చెప్పినా నమ్మరు. న్యాయం చేయమని స్వయంగా ఆ సైనికుడు ఫ్రాన్స్ రాజును ఆశ్రయిస్తాడు. తప్పు చేసిన వ్యక్తితో ముఖాముఖి తలపడేందుకు అనుమతివ్వాలని కోరగా.. మహారాజు అంగీకరిస్తాడు. ఫ్రాన్స్‌లో చట్టబద్ధంగా మంజూరయిన చివరి రణరంగంగా నిలిపోయిందీ కథ.
నటుడు డామన్, నిర్మాత స్కాట్ కలిసి 2015లో 'ద మార్టిన్'కు పనిచేశారు. 'ద లాస్ట్ డ్యూయల్' చిత్రాన్ని స్కాట్, డామన్, అఫ్లెక్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.