ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణ మురళి(Posani on Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh News) స్పందించారు. పోసాని ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ లాంటివాడని అన్నారు. 'మా' ఎన్నికలు(MAA Elections) నుంచి తాను తప్పుకున్నట్టు ట్విటర్ వేదికగా ప్రకటించిన గణేశ్(Bandla Ganesh MAA Elections) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు.
"మా' మహా సంగ్రామంలో ఇద్దరు గొప్ప వ్యక్తులు పోటీ చేస్తున్నారు. ఈ బరిలో నిలబడి, పొరపాటున నేనిచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే తప్పు చేసినవాడ్ని అవుతా. అలా కాకూడదనే ఉపసంహరించుకున్నా. ప్రకాశ్‌రాజ్‌కు అనూకూలంగానే ఈ పనిచేశా. ఎవరు గెలిచినా వారు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చూసేందుకు ప్రయత్నిస్తా. నాకు ప్రకాశ్‌రాజ్ గారంటే అభిమానం. ఆయనకు ఓటు వేస్తా. 'ఇండస్ట్రీ వైపు ఉన్నారా? పవన్ వైపా?' అని మంచు విష్ణు అన్న మాటలకు బాధ పడ్డా. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఇండస్ట్రీకి రథసారథి. సాధారణ నటుడిగా పరిచయమై స్టార్‌గా మారి, ఎన్నో బ్లాక్ బ్లస్టర్ చిత్రాలు అందించి, ఎంతోమందిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి ఎంతో మేలు చేశారు. ఏ హీరోకి సమస్య ఉన్నా ఆయన స్పందిస్తారు. 'నా మీద కోపం ఉంటే నన్ను ఇబ్బంది పెట్టండి. నా కారణంగా నాతోటి హీరోల్ని ఇబ్బంది పెట్టొద్దు' అని మాత్రమే పవన్ ఆ రోజు ఈవెంట్‌లో మాట్లాడారు. అంతమాత్రానికి ఆయనకు ఇండస్ట్రీతో సంబంధం లేదు, ఆయన ఇండస్ట్రీ మనిషే కాదు అని మాట్లాడటం నన్ను తీవ్రంగా కలచివేసింది. నేను ఇచ్చిన హామీ మీద ఇంకా నిలబడే ఉన్నాను. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ గెలవగానే ఆయన్ను ఒప్పించి, 100 మంది పేద కళాకారులకు డబుల్ రూం ఇళ్లను అందిస్తా. ఇది నా అజెండా. దీన్ని తప్పకుండా నెరవేరుస్తా."
- బండ్ల గణేశ్, సినీ నటుడు, నిర్మాత
నా స్థాయి తగ్గించుకున్నట్లే!
"పోసాని కృష్ణమురళి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్‌లాంటివాడు. తొలిసారి ప్రెస్‌మీట్‌లో పవన్ కల్యాణ్ గురించి ఏదో తన అభిప్రాయం చెప్పాడు అది ఓకే. తర్వాత ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేసి, పవన్ కల్యాణ్ తల్లి గురించి మాట్లాడటం తప్పు. ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ తల్లి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. మురళీగారి భార్య నా తల్లిలాంటిది. ఆయన్ను భరిస్తున్న ఆమెకి పాదాభివందనం చేస్తా. ఆయన గురించి మాట్లాడితే నా స్థాయి నేను తగ్గించుకున్నవాడ్ని అవుతా. సభ్య సమాజం ఆయన్ను అసహ్యించుకుంటోంది. పవన్ కల్యాణ్‌ని తిట్టండి, అంతేకానీ అంజనాదేవిగారిని, ఇతర ఆడవాళ్ల గురించి మాట్లాడటం ఎందుకు? ఎవరు అధికారంలో ఉంటే వారి వెనక తిరిగే వ్యక్తి పోసాని కృష్ణమురళి" అని బండ్ల గణేశ్ అన్నారు.
ఇదీ చూడండి.. Maa Elections: 'పవన్ మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా బడ్జెట్'