యాక్షన్ చిత్రాలు తీయడంలో దర్శకుడు బోయపాటి శ్రీను శైలి వేరు. ప్రస్తుతం ఈయన.. నటసింహం నందమూరి బాలకృష్ణతో చేస్తున్న సినిమా టైటిల్‌పై ఎన్నో ఉహాగానాలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి 'మోనార్క్' అనే పేరును ఫిల్మ్ ఛాంబర్లో నమోదు చేశారని సమాచారం. వచ్చే నెల 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా దీనిని అధికారికంగా ప్రకటించనున్నారట.
ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నారు. ఓ పాత్రలో అఘోరాగా దర్శనమివ్వనున్నారని బోయపాటి ఇదివరకే స్పష్టం చేశారు. కథానాయికగా నయనతార, శ్రియ, నమితల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరి పేరును ఖరారు చేయలేదు. తమన్ సంగీతం అందిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇదివరకే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్నా, లాక్డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.