ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత, పీఆర్వో బీఏ రాజు హఠాన్మరణం తెలుగు చిత్రసీమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణంతో షాక్‌కు గురైన పలువురు సినీప్రమఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు.
"బీఏరాజు.. ఈ పేరు తెలియని వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరు. మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయన నాతో పంచుకునేవారు. ప్రతి కొత్త విషయాన్ని ఆయన నుంచి తెలుసుకునేవాడిని. నా సినిమా షూటింగ్స్ జరిగే లొకేషన్స్‌కి సైతం ఆయన వచ్చి నాతో సరదాగా ముచ్చటించేవారు. నేను నటించిన ఎన్నో సినిమాలకు ఆయన పీఆర్‌వోగా వ్యవహరించారు. సినిమాల సమస్త సమాచారం.. ఎన్నో సంవత్సరాల క్రితం విడుదలైన క్లాసిక్స్‌కి సంబంధించిన కలెక్షన్స్, ట్రేడ్ రిపోర్ట్ రికార్డుల గురించి చెప్పగల గొప్ప నాలెడ్జ్ బ్యాంక్ ఆయన. ఏ సినిమా ఏ తేదీన విడులయ్యింది..? ఎంత వసూలు చేసింది? ఏ సెంటర్‌లో ఎన్నిరోజులు ఆడింది.. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు అంటూ ప్రతిదీ పరిశ్రమకు ఎన్‌సైక్లోపిడియాలా సమాచారం అందించేంత గొప్ప పత్రికా జర్నలిస్ట్.. మేధావి.. సూపర్‌హిట్ సినీ మ్యాగజైన్ కర్త, అనేక సినిమాల సక్సెస్‌లో కీలకపాత్ర పోషించిన బీఏ రాజుగారు లాంటి వ్యక్తి ఉండడం పరిశ్రమ అదృష్టం. అలాంటి వ్యక్తి నేడు లేరు! అన్న వార్త విని షాక్‌కి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను"
- మెగాస్టార్ చిరంజీవి.
"పీఆర్వో, సీనియర్ జర్నలిస్ట్ బీఏ రాజు మరణవార్త తెలియగానే షాక్ అయ్యాను. ఆయన్ను మా కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావిస్తాను. నా కెరీర్లో చాలా సినిమాలు ఆయనతో కలిసి పనిచేశాను. ఎప్పటికీ ఆ అనుభవం గుర్తుండిపోతుంది. ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీరని నష్టం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి."
-ప్రభాస్
"బీఏరాజు మరణ వార్త విని నిజంగా షాక్ అయ్యాను. సినీ పాత్రికేయుడిగా, 1500 చిత్రాలకు పీఆర్వోగా పనిచేసిన ఎంతో మంచి వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉంది. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఇకపై ఆయన్ని ఎంతో మిస్ అవుతాం"
- రాజమౌళి
"బీఏరాజు గారి అకాలమరణం నన్ను షాక్‌కు గురి చేసింది. సినీ జర్నలిస్ట్, పీఆర్వోగా సినీ పరిశ్రమకు ఆయన ఎన్నో సేవలందించారు. తెలుగు చిత్రపరిశ్రమలో నా ప్రయాణం మొదలైనప్పటి నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీర్చలేని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి"
- ఎన్టీఆర్
"బీఏ రాజు గారి అకాలమరణాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా చిన్నతనం నుంచి ఆయన నాకు తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నాను. ఆయన నాకెంతో ఆప్తుడు. మా కుటుంబమంటే ఆయనకు ఎనలేని గౌరవం. మేమే ఆయనకు ప్రపంచం. ఆయన మరణం సినీ పరిశ్రమకే కాదు ముఖ్యంగా మా కుటుంబానికి పెద్ద లోటు. రాజుగారు.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతాం"
- మహేశ్‌బాబు
"బీఏ రాజు.. నువ్వు లేని తెలుగు సినీ మీడియా, పబ్లిసిటీ.. ఎప్పటికీ లోటే. తరతరాలుగా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. నీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను"
- రాఘవేంద్రరావు
"నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ ప్రతి ప్రాజెక్ట్.. అది హిట్టైనా ఫ్లాపైనా ఆయన ఎంతో సపోర్ట్ అందించేవారు. రాజుగారి మరణం ఎప్పటికీ తీరని లోటు"
- సమంత
"నాకు ఎప్పుడూ అండగా ఉండమే కాకుండా క్లిష్ట సమయాల్లో మంచి సలహాలు అందించే వ్యక్తి, నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన వ్యక్తి రాజుగారు. మీ మరణంతో నా హృదయం ముక్కలైంది"
- తమన్
"రాజుగారి అకాల మరణ వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఎంతో కాలం నుంచి నాకు ఆయనతో అనుబంధం ఉంది. ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన చిరునవ్వుని ఇకపై మిస్ అవుతాను. ఆయన కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నాను'
- శ్రీనువైట్ల
"బీఏ రాజు మరణం నన్ను షాక్‌కు గురి చేసింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే మంచి మనస్సున్న వ్యక్తి. నాపై, నా సినిమాలపై ఆయన చూపించిన ప్రేమ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మిస్ యూ సర్. మీ ఆత్మకు శాంతి చేకూరాలి'
- కొరటాల శివ
'ఇది అన్యాయం రాజుగారు.. వాట్సాప్‌లో మీరు ప్రేమగా పంపే మెస్సేజ్‌లు, ఆశీస్సులు.. ట్విట్టర్‌లో మీరు పెట్టే పాతతరం తాలూకూ ‘సినిమా’ ఫొటోలు, జ్ఞాపకాలు.. ప్రతి సినిమా ఫంక్షన్స్‌లో నవ్వుతూ ఎదురయ్యే మీ పలకరింపులు.. ప్రతి వారం మా ఆఫీస్‌లలో మీరు అందించే ‘సూపర్‌హిట్’ పత్రికలు.. ఇలా ఎన్నో.. ఇవన్నీ ఇంకా నా జ్ఞాపకాలేనా..!! మీ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను'
- అనిల్ రావిపూడి
"నో.. రాజుగారి అకాలమరణం నన్ను ఎంతో బాధిస్తోంది. రాజు.. మీరు సినిమా పట్ల చూపించే ప్రేమ ఇకపై మేము ఎంతో మిస్ అవుతాం. ఇంతకాలం ప్రతిఒక్కరి కోసం మీరు నిలిచినందుకు ధన్యవాదాలు. ఇలాంటి బాధాకరమైన సమయంలో ఆయన కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను"
- ప్రకాశ్‌రాజ్
"నటుడిగా నా కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి నన్ను ఎంతో ప్రోత్సహించిన, నాకు అండగా నిలిచిన నా సోదరుడు, స్నేహితుడు రాజు మరణ వార్తతో హృదయం ముక్కలైంది. ఆయన స్థానాన్ని పూడ్చడానికి ఎంతో కాలం పడుతుంది"
- విశాల్
"దీనిని నేను నమ్మలేకపోతున్నాను. కొన్ని వారాల క్రితమే రాజుగారిని కలిశాను. ఆయన ఎంతో మంచి మనస్సున్న గొప్ప వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతూ పలికరించేవారు. చిరునవ్వుతో ప్రతిఒక్కర్నీ ప్రోత్సహించేవారు' - ఆనంద్ దేవరకొండ
"రాజుగారి అకాలమరణం నన్ను షాక్‌కు గురి చేసింది. సినీ జర్నలిజంలో ఎన్నో విలువలు తెలిసిన గొప్ప వ్యక్తి. మా కుటుంబానికి మంచి ఆప్తుడు, తరచూ మమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి"
- నాగశౌర్య
"మా బ్యానర్ ప్రారంభమైన నాటి నుంచి బీఏరాజుగారితో మాకెంతో అనుబంధం ఉంది. నేడు ఆయన అకాల మరణం మమ్మల్ని ఎంతో కలచివేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. ఆయన మరణం పెద్ద లోటు"
- ఎన్టీఆర్ ఆర్ట్స్
"సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, పీఆర్వో రాజుగారి అకాల మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నా కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి ఎన్నో సందర్భాల్లో ఆయన నాతో కలిసి పనిచేశారు. మన సినీ పరిశ్రమకు ఇదొక పెద్ద లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను" - కల్యాణ్‌రామ్
"ప్రతి శుక్రవారం విడుదలై సినిమా విజయం సాధిస్తుందని నమ్మే ఒకే ఒక్క వ్యక్తి రాజు గారు. ఆయన్ని ఇకపై ఎంతో మిస్ అవుతాం. మీరు చూపించే అమితమైన ప్రేమ, మీ వాట్సాప్ మెస్సేజ్‌లు మిస్ అవుతాం"
- నాని
"బీఏరాజు అకాలమరణం మమ్మల్ని ఎంతో కలిచివేస్తోంది. స్వచ్ఛమైన మనస్సు కలిగిన, ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే గొప్ప వ్యక్తి. ఆయన మా కుటుంబసభ్యుడు. ఆయన స్థానాన్ని ఇకపై ఎవరూ పూడ్చలేరు. ఆయన కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి"
- సురేశ్ ప్రొడెక్షన్స్
వీరితో పాటు నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ సహా పలువురు సినీప్రముఖులు కూడా బీఏ రాజు మృతి పట్ల సంతాపం తెలిపారు.