దక్షిణాది.. ఉత్తరాది అని తేడా లేకుండా వరుస చిత్రాలతో జోరు చూపిస్తోంది స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలున్నాయి. ఇప్పుడీ జాబితాలో 'డాక్టర్ జి' అనే మరో బాలీవుడ్ చిత్రం వచ్చి చేరింది. ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా, అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. జంగ్లీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని రకుల్, ఆయుష్మాన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ చదవడం ప్రారంభించినట్లు రకుల్ ఓ ఫొటో పంచుకుంది. ఓ వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయుష్మాన్.. ఉదయ్ గుప్తా అనే గైనకాలజిస్ట్ వైద్య విద్యార్ధిగా కనిపించనున్నాడు. ఆయనకు జూనియర్‌గా ఫాతిమా అనే వైద్య విద్యార్థినిగా రకుల్ దర్శనమివ్వనుంది.
ప్రస్తుతం రకుల్ బాలీవుడ్లో 'బ్యాంక్ గాడ్', 'మేడే', 'ఆటాక్' తదితర చిత్రాల్లో నటిస్తోంది. ఆమె తెలుగులో వైష్ణవ్ తేజ్‌కు జోడీగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించింది. ఆ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: 'ఎఫ్ 2' రీమేక్‌లో హీరోగా అర్జున్‌కపూర్!