"అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమను ఆదుకుంటామని చెబుతూనే ఉన్నాయి. ఆ మాటల్లో ఉన్న ఆ సమన్వయం.. చేతల్లో కనిపించడం లేదు. అది మేము గట్టిగా ప్రయత్నించకపోవడం వల్లనా? లేకపోతే వాళ్లు మమ్మల్ని సైడ్ చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు" అని అన్నారు నిర్మాత సురేశ్ బాబు. ఆయన నిర్మాణంలో వెంకటేశ్ హీరోగా రూపొందించిన చిత్రం 'దృశ్యం2'. ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు సురేశ్‌బాబు.
'దృశ్యం 2' విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
ఈ చిత్ర ఫలితం పట్ల సంతృప్తిగా ఉన్నా. మలయాళ 'దృశ్యం2' విడుదల కాక ముందే.. ఆ చిత్ర హక్కులు తీసుకున్నాం. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు సూచించాను. అలా స్క్రిప్ట్ పూర్తి కాగానే చిత్రీకరణ ప్రారంభించి.. త్వరితగతిన పూర్తి చేశాం.
ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇవ్వాలని ముందే నిర్ణయించారా?
పాటలు, ఫైట్లు ఉండే సినిమాల్ని థియేటర్లలో చూస్తే మంచి కిక్ వస్తుంది. ‘దృశ్యం 2’ అలాంటి వాణిజ్య హంగులున్న చిత్రం కాదు. ‘దృశ్యం 2’ని థియేటర్లలో విడుదల చేసినా మంచి రేటింగ్ వచ్చేదే. ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పులొచ్చాయి. ఇంట్లో కూర్చొని సినిమాలు ఆస్వాదించడానికి అలవాటు పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఓటీటీ అయితే ఫైనాన్షియల్‌గా సేఫ్ అవుతుందనిపించింది.
ఏపీలోని టికెట్ రేట్ల సమస్య.. ఓటీటీ వైపు వెళ్లడానికి కారణమైందా?
అది చిన్న సమస్యే. ఏ క్లాస్‌లో టికెట్ రేటు వంద రూపాయలంటే పర్లేదు. బీ, సీ సెంటర్లలో మరీ రూ.20, రూ.30గా ఉంది. అది అందరికీ నష్టదాయకమే. 2013 - 14లోనే టికెట్ రేటు రూ.40గా ఉంటే.. అదిప్పుడు మరీ రూ.20కి తగ్గించడం సరైన నిర్ణయం కాదు. ఏపీ ప్రభుత్వం పరిశ్రమపై కన్నెర్ర జేసిందా.. లేక ఎక్కడైనా మిస్ కమ్యునికేషన్ జరుగుతుందా? అన్నది తెలియదు కానీ, మరీ అంత తక్కువ రేట్లు పెట్టడమైతే సమంజసం కాదు. దీనిపై ఒక్కో వర్గం వాదన ఒక్కోలా ఉండొచ్చు. తక్కువ ధరల్లో టికెట్ అందించడం వల్ల ప్రజలకు సినిమా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం అనుకోవచ్చు. అలాగే ఓ ఉత్పత్తిని ఎంత ధరకు అమ్ముకోవాలనే హక్కు నిర్మాతకూ ఉంటుంది. వాళ్లూ తమకు నచ్చిన రేటుకు అమ్ముకోవాలనే అనుకుంటారు. ఇందులో ఏది తప్పు.. ఏది ఒప్పు అనేది నిర్ణయించడం కష్టం. 15నెలల్లో కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మాకు చేసింది ఏమీ లేదు. థియేటర్ కరెంట్ బిల్లులు మాఫీ చేయమన్నాం. ఏపీలో మూడు నెలలు చేశారు కానీ, ఆ డబ్బులు మాకు తిరిగి చెల్లించలేదు. థియేటర్ ఓనర్ల గురించి అసలెవరూ పట్టించుకోవడం లేదు.
పరిశ్రమ సమస్యలపై సురేశ్‌బాబు పెద్దగా స్పందించడం లేదని ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. ఏమంటారు?
ఇప్పుడు మాట్లాడితే 'తను ఓటీటీకి అమ్ముకుని మాట్లాడుతున్నాడేంటి' అని అనుకుంటారు కదా (నవ్వుతూ). నా తర్వాతి ఆరు సినిమాల్లో మూడింటిని ఇప్పటికే ఓటీటీకి అమ్మేశా. నేను పరిశ్రమలోనే పుట్టాను. ఇక్కడే పెరిగా. ఏం చేసినా సినిమా పరిశ్రమ కోసమే చేస్తాను. ఎవరో ఏదో అన్నారని పట్టించుకోను.
అది అన్ని రంగాల్లో ఉంది
ఏమైనా అంటే బ్లాక్ టికెట్ వ్యవస్థ అంటుంటారు. ఇది 20ఏళ్ల క్రితమూ ఉంది. అదీ ఎక్కడో కొద్దిమంది వ్యక్తులే చేశారు. నచ్చిన వాళ్లే అలా కొనుక్కుని సినిమా చూశారు. అయినా బ్లాక్ టికెట్ వ్యవస్థ.. మహా అయితే రెండు మూడు రోజులు ఉంటుందేమో? ఆ తర్వాత టికెట్ మామూలు ధరకే అమ్ముతారు. నిజానికి ఈ బ్లాక్ మార్కెట్ వ్యవస్థ అన్నది అన్ని రంగాల్లోనూ పాతుకుపోయి ఉంది. దాన్ని హైలైట్ చేయకుండా.. సినిమా వైపే వేలెత్తి చూపడం కరెక్ట్ కాదు.
పండగల వేళ జనాలు థియేటర్లకు వస్తున్నారని 'లవ్‌స్టోరి', 'సూర్యవంశీ'లాంటి చిత్రాలు నిరూపించాయి. అందుకే అందరికీ పండగలపై ఓ భరోసా ఏర్పడింది. ఒకప్పుడు సంక్రాంతికి నాలుగు చిత్రాలు.. నాలుగొందల థియేటర్ల చొప్పున విడుదలయ్యేవి. రెండు రాష్ట్రాల్లోని 1600 థియేటర్లని పంచుకునేవి. ఇప్పుడు ఒక్కో సినిమాకు 1500 స్క్రీన్స్ కావాలని అడుగుతున్నారు. అక్కడే గొడవ రానుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదురుతుందా? లేదా? అన్నది చూడాలి.
సర్‌ప్రైజ్ అవుతారు
'ఎఫ్ 3' తుది దశ చిత్రీకరణలో ఉంది. నెట్‌ఫ్లిక్స్ కోసం చేస్తున్న 'రానా నాయుడు' షూటింగ్ దశలోనే ఉంది. వీటితో పాటు మరికొన్ని స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయి. అవి తెలిశాక తప్పకుండా అందరూ సర్‌ప్రైజ్ అవుతారు.
ఇవీ చదవండి: