సూపర్ సినిమాతో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. కుర్రకారు హృదయాలను దోచుకుంది. వైవిధ్యమైన పాత్రలతో నటిగా తిరుగులేని పేరు సంపాదించుకుంది. యోగా టీచర్‌గా పని చేసిన స్వీటీ.. సినిమాల్లోకి ఎలా వచ్చింది? ఆ తర్వాత నుంచి తన ప్రయాణం ఎలా సాగుతోందో? ఇప్పుడు చూద్దాం..
అలా అవకాశం..
పూరీ జగన్నాథ్ 'సూపర్'లో నటి కోసం చూస్తున్న రోజులవి. ఆ సమయంలో ఆయన స్నేహితుడు యోగా టీచర్ అనుష్క గురించి చెప్పారు. అప్పుడు పూరీ.. అనుష్కను సంప్రదించారు. అలా ఆమె హైదరాబాద్‌కు వచ్చి తొలి అవకాశం చేజిక్కించుకున్నారు. పొట్టి దుస్తులు వేసుకుని కెమెరా ముందు నటించడం ఇబ్బందిగా భావించి అనుష్క అనేకసార్లు కన్నీరు పెట్టుకున్నారు. పట్టుదలతో సవాళ్లను ఎదుర్కొని, నిలదొక్కుకున్నారు. 'యోగా టీచర్‌గా పనిచేస్తున్నప్పుడు పూరీ జగన్నాథ్‌ను కలవడాన్ని మర్చిపోలేను. 2005లో ఆ ఒక్క రోజే నా జీవితాన్ని ఊహించని విధంగా మార్చేసింది' అని ఓసారి చెప్పారు.
ఆ పేరు తనకు తానే..
అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరును మార్చుకున్నారు. 'నా అసలు పేరు స్వీటీ. మా పిన్ని పెట్టింది. అమ్మవాళ్లు ప్రతి సంవత్సరం మారుస్తాం అని మాటిస్తూ.. పదో తరగతి వరకు తీసుకొచ్చారు. ఇంటర్‌లో అడ్మిషన్ అప్పుడు స్వీటీ అని రాస్తే 'ముద్దు పేరు బావుంది. కానీ అసలు పేరు రాయి' అన్నప్పుడు ఏదోలా అనిపించింది' అని ఓసారి అనుష్క గుర్తు చేసుకున్నారు. 23 ఏళ్ల వయసులో సెట్‌లో 'స్వీటీ' అని పిలుస్తుంటే బాగోలేదన్నారట. దీంతో ఆమె తనకు తానే అనుష్క అని పేరు పెట్టుకున్నారు. ఈ పేరుకు అలవాటు పడటానికి ఏడాది పట్టిందట.
ఆ భయంతో కాలేజీకి వెళ్లలేదు..
యువతలో 'దేవసేన'కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా వేదికగా ఎందరో అభిమానులు అనుష్కకు తమ ప్రేమను తెలుపుతున్నారు. ఆమె కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఓ వ్యక్తి వెంటపడ్డాడట. 'ఓ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. 'ఓహో అలాగా' అన్నా. తర్వాత నుంచి బహుమతులు తీసుకొస్తూ వెంటపడేవాడు. కాస్త భయమేసి కొన్నాళ్లు కాలేజీకి వెళ్లలేదు' అని చెప్పారామె.
అమ్మ అలా అన్నప్పుడు షాక్..
తెరపై ఎలా ఉన్నా.. తెర వెనుక మాత్రం అనుష్క చాలా పద్ధతిగా ఉంటారు. సల్వార్ కమీజ్, చీరల్లో మాత్రమే కనిపిస్తుంటారు. అయితే డ్రెస్సింగ్ విషయంలో ఓ సారి తన తల్లి అన్న మాటలు షాక్‌కు గురి చేశాయని అనుష్క చెప్పారు. 'మా అమ్మ ఎప్పుడూ నేను పద్ధతిగా ఉండాలనుకుంటుంది. కానీ తను 'బిల్లా' చూసినప్పుడు 'ఇంకాస్త స్టైలిష్‌గా ఉండొచ్చు కదా. సగం మోడ్రన్‌గా, సగం పద్ధతిగా ఆ డ్రెస్సులేంటి?' అన్నప్పుడు షాకయ్యా' అని తెలిపారు.
చిన్న పిల్లలకు పాఠాలు..
యోగా టీచర్‌గా చేయడానికి ముందు స్వీటీ స్కూల్‌లో చిన్న పిల్లలకు పాఠాలు చెప్పేవారు. ఈ విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. 'నేను హిస్టరీ, ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీలో డిగ్రీ చేశా. బీసీఏ కూడా పూర్తి చేశా. ఆ తర్వాత ఓ స్కూల్‌లో మూడో తరగతి పిల్లలకు పాఠశాలు చెప్పా. ఈ విషయం అందరికీ తెలియదు' అని తెలిపారు.
కాబోయేవాడు పొట్టిగా ఉన్నా..
అనుష్క అనగానే.. అందంతోపాటు ఆమె ఎత్తు కూడా గుర్తొస్తుంటుంది. మరి ఎత్తు వల్ల సమస్యలు వచ్చాయా? అని ఆమెను అడిగితే.. 'సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అది సమస్య అవుతుందేమోనని భయపడ్డా. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. కాబట్టి ఇబ్బంది లేదు. నాకంటే కాస్త ఎత్తు తక్కువ ఉన్న హీరోలతో చేసిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి' అన్నారామె. అంతేకాదు భవిష్యత్తులో తనను చేసుకోబోయేవాడు తనకంటే పొట్టిగా ఉన్నా ఫర్వాలేదన్నారు. 'అందం అనేది బోనస్.. మొదటి ప్రాధాన్యం మాత్రం కాదు..' అని చెప్పి ఆదర్శంగా నిలిచారు.
అది నాకు నచ్చదు..
సినిమా షూటింగ్ పూర్తయితే, ఇక అనుష్క బయట కనిపించే ప్రసక్తే లేదు. ఇదే ప్రశ్న ఆమెను అడిగితే.. 'షూటింగ్స్, ఇల్లు.. ఇవే నా ప్రపంచం. సినిమా విడుదలకు ముందు ప్రచారం కోసం వస్తాను. అందుకే ఎక్కడా కనిపించను. ప్రమోషనల్ కార్యక్రమాలంటే నాకు కొంచెం కష్టమే. సినిమాల కోసం మేకప్ కచ్చితంగా వేసుకోవాలి. కానీ బయటికి వస్తే లైట్‌గా అయినా మేకప్ వేసుకోవాలి కదా. అది నాకు నచ్చదు' అని పేర్కొన్నారు.
నేను నమ్మేదాన్ని కాదు...
15 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ ఘటనలు ఎదురుకాలేదని, అందుకే వాటి గురించి చెప్పినప్పుడు నమ్మబుద్ధి కాదని అనుష్క అంటుంటారు. ''సూపర్' నుంచి ఎవరితో పని చేసినా నాతో బాగానే ప్రవర్తించారు. అందుకే క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎవరైనా చెబితే నమ్మబుద్ధి కాదు. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో పార్టీలకు వెళ్లకపోతే, కార్యక్రమాలకు హాజరు కాకపోతే అవకాశాలు రావని అంటుండేవారు. నేను నమ్మేదాన్ని కాదు. మనకేం కావాలో మనం తెలుసుకోవాలి. నా వరకు.. 'నువ్వు ఇలానే చేయాలి' అని షరతులు పెడితే 'చేయను' అని తెగేసి చెప్పేస్తా. మనలో ఆ నమ్మకం ఉండాలి. దాన్ని తల్లిదండ్రులు నేర్పించాలి. పేరెంట్స్ సరైన గైడెన్స్ ఇవ్వకపోతే పిల్లలు చెడు దారులు పడతారు' అన్నారు. 'నిశ్శబ్దం' తర్వాత స్వీటీ ఇంకా తన కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు.