"భానుమతి ఒక్కటే పీస్" అంటూ సాయి పల్లవి ఎంత అల్లరి చేసిందో చెప్పనవసరం లేదు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుందా పాత్ర. 'ఫిదా' చిత్రంలో సాయి పల్లవి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అంతటి హుషారైన పాత్రలో మళ్లీ ఎప్పుడు కనిపిస్తుందా.. అని ఎదురు చూశారు ఆమె అభిమానులు. తాజా సమాచారం మేరకు త్వరలోనే ఆ సర్‌ప్రైజ్ ఉండబోతుందట.
దర్శకుడు అనిల్ రావిపూడి వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా 'ఎఫ్ 3' తెరకెక్కిస్తున్నాడు. గతంలో వచ్చిన 'ఎఫ్ 2'కి సీక్వెల్ ఇది. స్క్రిప్టు సిద్ధమైనా.. వెంకీ, వరుణ్ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాక అనిల్ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దాంతో ఈ విరామ సమయంలో అనిల్ ఓ నాయిక ప్రాధాన్య చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారని టాక్. హైపర్ యాక్టివ్‌గా ఉండే ఆ పాత్రకు సాయి పల్లవి అయితే బాగుంటుందని అనుకున్నారట. 'ఫిదా'లోని భానుమతిలా ఉండొచ్చని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి సాయి పల్లవి పచ్చజెండా ఊపుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.