"జీవితాల్లో కొన్ని అనూహ్యంగా జరుగుతుంటాయి. ఆ సందర్భాల్లో మనం ఎలా స్పందిస్తాం? ఎవరితో ఎలా ఉంటాం? అనేదే ముఖ్యం. 'బిగ్‌బాస్' ఇల్లు అలా జీవితానికి సంబంధించిన చాలా పాఠాల్నే నేర్పించింది" అన్నారు అభిజీత్. హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల ముగిసిన రియాలిటీ షో 'బిగ్‌బాస్ 4' విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
"విజేతగా నిలిచాననే ఆనందం కంటే, ఇంత మంది ప్రేమని పొందానా? అనే విషయం నన్ను ఎక్కువ సంతోషపెట్టింది. ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపోటములు ఉంటాయి. ప్రతి ఒక్కరం విజేతల్ని, పరాజితుల్ని చూస్తూనే ఉంటాం. ఇది వాటికి భిన్నమైన అనుభవం. నాపైన ఇంత ప్రేమ, ఇంత అభిమానం ఉందా? అని ఆశ్చర్యం కలిగింది. కుటుంబం, స్నేహం ఎంత ముఖ్యమో బిగ్‌బాస్‌లో బాగా అర్థమైంది. బయటికొచ్చాక నా స్నేహితులు, నా వాళ్లు నా పక్కనే ఉండాలనిపిస్తుంది. ఇక వాళ్లందరినీ వదలకుండా ఉంటాను. బయటికి రాగానే రోజంతా అమ్మానాన్న, నాన్నమ్మ, నా పెంపుడు కుక్క రౌడీతోనూ గడిపా. సినిమానే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇకపై మళ్లీ సినిమాలతో బిజీ అవుతా" అన్నారు హీరో అభిజీత్.
ఇదీ చూడండి: 'పుష్పరాజ్' కోసం సునీల్!