'ఉరీ: ద సర్జికల్ స్ట్రైక్'తో స్టార్ హీరోగా మారిపోయాడు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్. ఈ ఏడాది జనవరిలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇటీవల జాతీయ అవార్డునూ సొంతం చేసుకుంది. అయితే ఒకానొక సందర్భంలో ఇందులో నటించేందుకు నో చెప్పెద్దామనుకున్నాడట విక్కీ.
"ఉరీ సినిమా చేయనని ఒక సందర్భంలో చెప్పేందుకు సిద్ధమయ్యా. 'రాజీ' షూటింగ్లో ఉండగా రోని స్క్రూవాలా బృందం నుంచి ఫోన్ వచ్చింది. వారు ఓ యాక్షన్ స్క్రిప్ట్ పంపారు. నాతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. అయితే ఇంటికి పంపిన స్క్రిప్ట్‌ను చదివిన తర్వాత అసలు సర్జికల్ స్ట్రైక్ సమయంలో ఏం జరిగిందనే విషయం తెలుసుకోవాలనుకున్నాను." -విక్కీ కౌశల్, హీరో
అయితే తొలుతు స్క్రిప్ట్‌ను 4 గంటల పాటు చదివినా విక్కీ కౌశల్‌కు ఏం అర్థం కాలేదట. అందుకే ఆపరేషన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకున్నానని చెప్పాడు.
"అందులో ఆర్మీ గురించి సాంకేతిక అంశాలు ఎక్కువగా ఉన్నాయి. 'రాజీ' సినిమాలో పాక్ మేజర్‌గా నటించాను. ఈ సినిమా విషయానికొస్తే భారత్ తరఫున ఆర్మీ అధికారి పాత్ర పోషించాను. అందుకే అంత తొందరగా కనెక్ట్ కాలేకపోయా" -విక్కీ కౌశల్, హీరో
మెరుపుదాడులపై పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత విక్కీ కౌశల్.. ఈ సినిమాలో నటించాడు. ప్రేక్షకుల మన్ననలు అందుకొన్నాడు. ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించాడు. రూ.25 కోట్లతో నిర్మితమై.. దాదాపు రూ.350 కోట్ల మేర వసూళ్లు సాధించింది ఈ చిత్రం.