సుకుమార్- అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారని తెలియగానే ప్రేక్షకులు ఆశలు పెంచేసుకున్నారు. ఆర్య లాంటి జోష్ రిపీట్ అవుతోందని సంబరపడ్డారు బన్నీ అభిమానులు. కానీ అదే సమయంలో ఈ ట్రెండీ డైరెక్టర్‌తో సినిమా చేయట్లేదంటూ మహేశ్ ప్రకటించడం పరిశ్రమ వర్గాల్లో ఆలోచన రేకెత్తించింది.
ఆ రోజు ఏం జరిగింది..
రాంచరణ్ అనుసరిస్తూ బన్నీ సినిమాల విషయంలో ఆచితూచి అడుగేస్తున్నాడు. ఎందుకంటే మగధీర లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత చరణ్ చేసిన సినిమాలు పెద్దగా అనుకున్నంత ఫలితాలను ఇవ్వలేదు. ఆ సమయంలోనే సుక్కుతో రంగస్థలం చేశాడు రాంచరణ్. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీలో నటనతో చెర్రీకి టాలీవుడ్లో ప్రశంసలు వెల్లువెత్తాయి.
అల్లుఅర్జున్ ప్రస్తుతం మంచి సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇంకేముంది రాంచరణ్‌కు హిట్ ఇచ్చిన దర్శకుడు, తనకు సినిమాలతో గుర్తింపునిచ్చింది సుకుమార్ అని భావించాడు బన్నీ. అందుకే ఈ డైరెక్టర్‌తోనే తర్వాతి చిత్రం చేయనున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.
మహర్షి చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. దీనిపై స్పందించిన ప్రిన్స్... సుకుమార్‌తో సినిమా చేయట్లేదని ట్వీట్ చేశాడు. అనుకోని పరిస్థితుల్లో చిత్రం పట్టాలెక్కట్లేదని చెప్పాడు. అంతేకాదు సుకుమార్- బన్నీలకు శుభాకాంక్షలు తెలిపి ఊహాగానాలకు తెరదించాడు.