మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్లపై దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి టీజర్లు విడుదలయ్యాయి. అయితే ఎన్టీఆర్ కొమురం భీమ్ టీజర్‌పై ఆదివాసీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరాధ్యున్ని మైనార్టీగా చూపించడం వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆసిఫాబాద్ జిల్లాలో ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అసలు భీమ్ నిజంగానే మైనార్టీగా మారాడా లేక అదంతా రాజమౌళి కల్పితమేనా అనేది ప్రశ్నార్థకరంగా మారింది. ఈ క్రమంలో గతంలో కొమురం భీమ్ వ్యక్తిగత జీవితాన్ని, గోండుల జీవనస్థితిపై పరిశోధన చేసిన ప్రముఖ దర్శకుడు అల్లాణి శ్రీధర్, అలాగే కొమురం భీమ్ కుటుంబానికి సన్నిహితుడు, భీమ్ జీవిత కథను డాక్యుమెంటరీగా మలిచిన రచయిత, దర్శకుడు నాగబాల సురేష్ ఈటీవీ భారత్‌తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
"పోరాట యోధుడి పాత్రపై వివాదం ముసురుకోవడం చాలా బాధాకరం. కొమురం భీమ్ చరిత్రను మేం చాలా అధ్యయనం చేశాం. 75 ధారావాహికలుగా భీమ్ జీవితాన్ని రూపొందించా. భీమ్ మీద మొదటిసారి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్, ఒక బుర్రకథ, నాటిక రాశాను. మా నాన్నగారు, తాతగారు భీమ్ గురించి చెప్పేవాళ్లు. కొమురం భీమ్ మూడో భార్య సోంబాయితో కలిసి అనేక విషయాలు తెలుసున్నా. కొమురం భీమ్‌తో పోరాటంలో పాల్గొన్న కొమురం సూరుతో కూడా మాట్లాడాం. భీమ్ కొంతకాలం అస్సోం తోటల్లో పనిచేశారు. దానికంటే ముందు మహారాష్ట్ర చంద్రాపూర్‌లో ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో కంపోజర్‌గా పనిచేశారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమాని కూడా గాంధేయ మార్గంలో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తుండేవారు. బ్రిటీష్ సైన్యం ఆ యజమానిపై దాడి చేసి అరెస్టు చేసింది. ఆ సమయంలో భీమ్ అస్సోం పారిపోయారు. గతంలోనూ శివాజీ మహారాజ్, రానా ప్రతాప్‌లు మారువేషాల్లో కొన్ని చోట్లకు వెళ్లేవాళ్లు. అలాగే భీమ్ కూడా వెళ్లాడనేది సందేహం మాత్రమే. అందుకే రాజమౌళి అలా చూపించారు అనుకుంటున్నాం. అయినా టీజర్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. రాజమౌళిగారు కొమురంభీమ్ పాత్రకు అన్యాయం చేస్తాడని అనుకోవడం లేదు. ఎందుకంటే కల్పితమైన బాహుబలి పాత్రకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. అలాంటిది ఒక నిజమైన పోరాట యోధున్ని తప్పుగా చూపిస్తాడనుకోవడం లేదు. కొమురం భీమ్ పాత్ర ఇవాళ తెలంగాణకు మాత్రమే పరమితమై ఉంది. సినిమా విడుదల తర్వాత ఆ పాత్ర యావత్ ప్రపంచానికి గొప్పగా పరిచయం అవుతుంది. బాహుబలి కంటే భారీ స్థాయిలో ఆ పాత్రను రాజమౌళి పరిచయం చేస్తారు. ఆదివాసీలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు."
- నాగబాల సురేష్, తెలుగు సినీ రచయితల సంఘం ఉపాధ్యక్షుడు
"రాజమౌళి తెలుగు వాళ్లకే కాదు దేశానికే పేరుతెచ్చిన దర్శకులు. ఆయన టీం ఎంత కష్టపడుతుందో వేరే చెప్పక్కర్లేదు. విజయేంద్ర ప్రసాద్ బాహుబలి, బజరంగీ బాయిజాన్ లాంటి అద్భుతమైన చిత్రాలకు కథలందించారు. వీళ్లంతా సమగ్రంగా పరిశోధన చేశాకే ఆర్ఆర్ఆర్ను మొదలుపెట్టారు. ఫిక్షనల్ పిరియాడిక్ ఫిల్మ్ అని రాజమౌళి ముందే చెప్పారు. రాజమౌళి ఈ సినిమా టేకప్ చేస్తున్నప్పుడు, విజయేంద్రప్రసాద్ రాస్తున్నప్పుడు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు నటిస్తున్నప్పుడు... కొమురం భీమ్ అనే పాత్రకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. భీమ్ నిజమైన హీరోగా మారుతారని నాకు ఆశగా ఉంది. ఎందుకంటే మేం కొమురం భీమ్ తీసినప్పుడు ఆయన గురించి ఎలాంటి డాక్యుమెంటరీలు, పుస్తకాలు లేవు. అల్లం రాజయ్య రాసిన ఒక నవల మాత్రమే ఉండేది. కానీ మా వర్షన్లో మేం పరిశోధన చేసి కొమురం భీమ్ తీశాం. ఈ రెండు తప్ప ఎలాంటి ఆధారాలు లేవు. కొమురం భీమ్ సినిమా తీసిన కొత్తలో ఎవరీ కొమురం భీమ్ అన్నారు. అవార్డు తీసుకున్న తర్వాత ఎందుకు ఈ కొమురం భీమ్ అన్నారు. 2010లో విడుదలైన తర్వాత ఆ సినిమా వంద రోజులు ఆడింది. దాదాపు 26 కేంద్రాల్లో ఉట్నూరు నుంచి విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో 100 రోజులు ఆడింది. దీపక్ థియేటర్లో నాలుగు ఆటల్లో హౌజ్ పుల్ కలెక్షన్లతో 50 రోజులు ఆడింది. అంటే ఒక సినిమా నిజాయతీగా తీస్తే ప్రజలు ఎప్పటికైనా ఆదరిస్తారు. అలాగే ఇవాళ ఆదివాసీల సంస్కృతిని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ల సంస్కృతి ఒక్కటే చాలా పవిత్రంగా ఉంది. వాళ్లు ఆర్ఆర్ఆర్ను అభిమానించి ఆదరించేలా రాజమౌళి సినిమా ఉంటుంది. ఆ నమ్మకం మాకుంది. కొమురం భీమ్ ఈ సినిమా ద్వారా జనాల్లోకి మరింతగా వెళ్తారు. నిజమైన హీరో అనిపించుకుంటారు."
- అల్లాణి శ్రీధర్, కొమురం భీమ్ దర్శకుడు
ఈ సినిమా ఇటీవలే తిరిగి షూటింగ్ ప్రారంభించుకుంది. అలాగే ఇప్పటికే రామ్ చరణ్, తారక్ పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్లు నెట్టింట దుమ్మురేపుతున్నాయి. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి.