బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ దేశంలో ఎలాంటి విపత్తు వచ్చినా ముందుగా స్పందిస్తుంటారు. గతేడాది కొవిడ్ సమయంలో ఎంతోమందికి సాయం చేశారు. ఈసారి కరోనా రెండో దశలోనూ ఆసుపత్రులకు కావాల్సిన పరికరాలతో పాటు ఆక్సిజన్ సిలిండర్స్, కొవిడ్ పడకలను విరాళంగా ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నారు. తాజాగా ఆయన మూడువేల ఆరువందల మంది డ్యాన్సర్లకు నెలవారి రేషన్ సరుకులు అందించడానికి ముందుకొచ్చారు.
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యను అతని 50వ పుట్టినరోజు కోసం.. అక్షయ్ "ఏమి కావాలో.. కోరుకో?" అని అడిగారట. అందుకు "నేనొక సాయం కోరా. ఆయన వెంటనే ఒప్పేసుకున్నారు" అని ఆయన తెలిపారు.
"పదహారు వందలమంది జూనియర్ కొరియోగ్రాఫర్లు, వృద్ధ నృత్యకారులకు ఒక నెల రేషన్‌తో పాటు సుమారు 2000 మంది ఇతర సహాయ డ్యాన్సర్లకు సహాయం చేయమని కోరాను. దీనికి అక్షయ్ అంగీకరించారు" అని ఆచార్య వెల్లడించారు.
గణేష్ ఆచార్య ఫౌండేషన్ ద్వారా కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రాంతాల వారిగా రేషన్ పంపిణీ, ప్యాకింగ్‌ను గణేష్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు తోడు అతని భార్య కూడా పాల్గొంటుంది. నమోదు చేసుకున్న డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లకు అవసరమైన వస్తువులను కొనడానికి డబ్బును లేదా వారి కుటుంబాలను పోషించడానికి రేషన్ సరకుల కిట్‌ను అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సాయం పూర్తిగా డ్యాన్సర్ల కోసమేనట.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ 'రామ్‌సేతు' అనే చిత్రంలో నటిస్తున్నారు. అభిషేక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ని ఈ ఏడాది మార్చి 18న అయోధ్యలో ప్రారంభించారు. అక్షయ్ ఇందులో పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నారు.