అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అఖిల్ ఓ సినిమా కోసం కలిసి పనిచేయనున్నారని తెలుస్తోంది. ఏయన్నార్ - నాగార్జున - నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన 'మనం' చిత్రంలో అఖిల్ ఓ అతిథి పాత్రలో మెప్పించారు. మళ్లీ నాగార్జున - తన ఇద్దరు తనయులతో కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి.. నాగ్-అఖిల్‌తో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేసినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.
'ఎఫ్-2', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు చూసిన నాగ్.. అనిల్‌తో కలిసి పనిచేయాలనుకున్నారని, అందుకే సదరు దర్శకుడు ఓ మంచి కథను సిద్ధం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనిల్ సిద్ధం చేసిన కథ తనకు నచ్చడం వల్ల నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
'సరిలేరు నీకెవ్వరు' విజయం తర్వాత అనిల్ రావిపూడి.. 'ఎఫ్-3' చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా 'ఎఫ్-3' సినిమా కొంతకాలంపాటు వాయిదా వేసి.. నాగార్జునతో మల్టీస్టారర్ నిర్మించాలనే ఉద్దేశంలో అనిల్ ఉన్నట్లు సమాచారం. నాగ్‌తో సినిమా గురించి అనిల్ రావిపూడి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.