ajith kumar press release: 'నన్ను ఇకపై 'తలా' అని పిలవకండి. అజిత్‌కుమార్, అజిత్ లేదా 'ఏకే' అని పిలవండి చాలు' అని చెప్పారు అజిత్. తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని అగ్రస్థానంలో ఉన్నారు అజిత్. ఆరంభంలో ఆయన్ను అందరూ 'అల్టిమేట్ స్టార్' అజిత్ అని పిలిచేవారు. కానీ అప్పట్లో కూడా ఓ ప్రకటన విడుదల చేసి 'అల్టిమేట్ స్టార్' అని పిలవకండని చెప్పారు. ఆ తర్వాత తన అభిమానుల సంఘాన్ని కూడా రద్దు చేశారు. ఏ నటుడు కూడా చేయని సాహసం ఇది అయినప్పటికీ.. అజిత్ తనదైన శైలితో వెళ్తున్నారు. అలాగే, సినిమాల్లో నటించడం మాత్రమే తన పనిగా భావిస్తున్న అజిత్.. ఆ సినిమాకు సంబంధించి ఒక్క మాట కూడా ఈ మధ్య మాట్లాడటం లేదు. ప్రెస్‌మీట్లు, ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. అయినప్పటికీ, అజిత్ అంటే ఆయన అభిమానులకు ఎనలేని ప్రేమ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అజిత్‌ను తన అభిమానులందరూ ప్రేమగా 'తలా' అని పిలుస్తుంటారు. కానీ ఇప్పుడు తనను అలా పిలవొద్దని ప్రకటన విడుదల చేశారు అజిత్. దీనికి సంబంధించి ఆయన మేనేజరు సురేష్‌చంద్ర బుధవారం చేసిన ట్వీట్‌లో.. "ప్రియమైన మీడియా, నా అభిమానులు, ప్రజలకు నమస్కారం.. ఇకపై నా గురించి రాసేటప్పుడుకానీ, నన్ను ప్రస్తావించేటప్పుడు కానీ.. 'తలా' అని, ఇతరత్రా పేర్లతో పిలవొద్దని కోరుకుంటున్నా. అజిత్‌కుమార్, అజిత్ లేదా ఏకే అని చెబితే చాల"ని పేర్కొన్నారు.
అజిత్‌కు కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్బింగ్ అయి.. మంచి విజయాన్ని అందుకున్నాయి. లవర్‌బాయ్, క్లాస్ పాత్రల్లో కనిపించిన అజిత్‌ని మాస్ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లిన చిత్రం 'ధీన' (2001). ఎ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. నటుడిగా ఆయన స్థాయినీ పెంచింది. అందులో పోషించిన పాత్ర (తలా) పేరే ఇప్పుడు అభిమానులు పిలుచుకునే ముద్దుపేరైంది.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అజిత్ 'వలిమై' చిత్రంలో నటిస్తున్నారు. హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. టాలీవుడ్ నటుడు కార్తికేయ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు.
ఇదీ చదవండి:'అఖండ' రిలీజ్‌కు రెడీ.. 'రాధేశ్యామ్' హిందీ వెర్షన్ సాంగ్