Lagacharla Incident : లగచర్ల ఘటనతో ప్రశాంతతకు పెట్టింది పేరుగా ఉన్న దుద్యాల మండలం, లగచర్ల, పులిచర్లకుంట తండా, రోటిబండ తండాలు గత ఆరు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాయి. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న ఇక్కడి ప్రజలు కొట్లాటలు, పోలీసు కేసులు అంటే ఎరుగరు. ఊళ్లో చిన్నచిన్న గొడవలైనా పోలీస్ స్టేషన్ వరకు రాకుండా ఊళ్లోనే రాజీపడతారు. ఊరు రాజకీయంగానూ ఎంతో చైతన్యవంతమైనది. కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత మాజీ ఎంపీ డి.విఠల్రావు స్వస్థలం లగచర్ల. ఇక్కడి వారంతా కలిసిమెలసి ఉంటారు. కానీ అలాంటి ఆ గ్రామాలు ఫార్మా కంపెనీ భూసేకరణ నిమిత్తం మాట్లాడటానికి వచ్చిన కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేశారు. ఈ నెల 11న జరిగిన లగచర్ల దాడి ఘటన ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.
కొంత మంది చేసిన తప్పునకు ఊరంతా బలి కావాల్సి వచ్చిందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం అవుతుందోనని భయం భయంగా గడపాల్సి వస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు తామెప్పుడూ చూడలేదని గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఔషధ కంపెనీ కోసం ఇదే మండలంలోని పోలేపల్లిలో గ్రామసభ నిర్వహిస్తే ఎలాంటి గొడవలు లేకుండా ఉన్నాయి. అదే తమ గ్రామంలో జరిగితే ఇలా దాడి జరగడం దురదృష్టకరమని ప్రజలు వాపోతున్నారు.
ఆరు రోజులైనా వీడని భయం : అధికారులపై దాడి జరిగి 6 రోజులు అవుతుంది. కానీ అక్కడి ప్రజల్లో మాత్రం భయాందోళనలు వైదొలగడం లేదు. ఎప్పుడు ఎవరు వచ్చి ఎవరిని తీసుకెళతారోననే భయం గుప్పిట్లో గడుపుతున్నారు. ఇప్పటికే పోలీసులు లగచర్ల, తండాల్లోని 50 మంది అనుమానితులను పట్టుకెళ్లి విచారించగా, అందులో 34 మందిని విడిచిపెట్టారు. మిగతావారిని దాడితో సంబంధం ఉందని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇంకా దాడిలో పాల్గొన్న పలువురు ఎక్కడున్నారో కుటుంబ సభ్యులకు కూడా తెలియడం లేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది యువకులు అరెస్టుల భయంతో ఇంకా బయటనే గడుపుతున్నారు.
కొనసాగుతున్న అరెస్టుల పరంపర : అధికారులపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. అలాగే వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించే ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. పరారీలో ఉన్నవారు అరెస్టయితే వారు ఇంకెవరి పేర్లు చెబుతారోనని భయంతో గ్రామాల్లో చాలా మంది ఉన్నారు. ఇంకా ఎంతమంది కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందో అని ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఎప్పుడు ఎవరిని తీసుకెళ్తారో అనే భయం - నిర్మానుష్యంగా మారిన ఆ 3 గ్రామాలు