తండ్రి ఓ స్టంట్ మాస్టర్, దర్శకుడు, తల్లి ఓ నిర్మాత.. ఈ నేపథ్యం ఉంటే వెండితెరపైకి రావడం సులువే. కానీ తొలి చిత్రంతోనే సూపర్‌హిట్ అందుకొని స్టార్ గుర్తింపు పొందడమే కష్టం. కానీ అజయ్ దేవగణ్ అదే సాధించాడు.
బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్, స్టంట్‌మాస్టర్ వీరూ దేవగన్ కొడుకుగా పరిచయమైనా అరంగేట్రంతోనే అదరగొట్టిన సినిమా 'ఫూల్ ఔర్ కాంటే'. ఇందులో అజయ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. హేమమాలిని మేనకోడలు మధుబాలకి కూడా ఇదే తొలి సినిమా కావడం విశేషం.
మెచ్చుకున్న మహేశ్!
కుకు కోహ్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా అజయ్ దేవగణ్‌కు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. దీన్నే తెలుగులో 'వారసుడు'గా రీమేక్ చేశారు. ఈ సినిమాను చూశాక అజయ్ దేవగణ్‌ను రోల్‌మోడల్‌గా భావించానని తెలుగు కథానాయకుడు మహేష్ బాబు ఎన్నో సార్లు చెప్పాడు. అప్పట్లో సౌండ్‌ట్రాక్, యాక్షన్ సన్నివేశాలలో కొత్త ఒరవడి సృష్టించిన సినిమాగా దీన్ని చెప్పుకున్నారు.
ఇందులో రెండు బైక్‌ల మీద చెరో కాలూ వేసి బ్యాలన్స్ చేసుకుంటూ అజయ్ దేవగణ్ రావడాన్ని ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో అనుకరించారు.
డాన్ సామ్రాజ్యానికి అధిపతి అయిన అమ్రిష్‌పురి తన తర్వాత వారసుడిగా తన కొడుకు అజయ్ దేవగణ్‌ను ప్రకటించడం ఆ ముఠా వాళ్లకి నచ్చదు. దాంతో వాళ్లు అజయ్‌కు కొత్తగా పుట్టిన బాబును అపహరిస్తారు. ఆ బాబును ఎలా కాపాడుకున్నాడనేదే కథ. మూడు కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా 12 కోట్ల రూపాయలను ఆర్జించింది. అజయ్ దేవగణ్‌కి ఓ మంచి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చింది. 'ఫూల్ ఔర్ కాంటే' ఈరోజే (నవంబర్ 22, 1991) విడుదలైంది.
ఇదీ చదవండి:కన్నడ 'శివప్ప' చిత్రంలో అంజలి