యువ నటుడు అడివి శేష్.. కొవిడ్ బాధితులకు సహాయం చేస్తూ ఉదారత చాటుకున్నారు. కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో 300లకి పైగా కొవిడ్ బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అక్కడ తాగు నీటి కొరత ఉందని తెలుసుకున్న శేష్.. 865 లీటర్ల వాటర్ బాటిళ్లను ఆ ఆసుపత్రికి పంపించారు. అలానే అక్కడ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు తనవంతు కృషి చేశారు. ఆస్పత్రి సిబ్బంది సహా ఎవరూ తాగు నీటికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు నీటి శుద్ధీకరణ యంత్రాన్ని ఏర్పాటు చేయించారు. ఇది గంటకు 1000 లీటర్ల నీటిని అందిస్తుంది.
ఎప్పటి నుంచో ఉన్న సమస్యను తీర్చడం వల్ల రోగులు, వైద్యులు, ఇతర సిబ్బంది నటుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. 'సెలబ్రిటీలు ఏదైనా సమస్యకు పాక్షికంగా పరిష్కారం చూపడం సహజం.. కానీ శాశ్వత పరిష్కారం చూపడం అసాధరణం' అంటూ సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. ప్రస్తుతం 'మేజర్' చిత్రంతో అడవి శేష్ బిజీగా ఉన్నారు. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా శశి కిరణ్ తిక్క దీనిని తెరకెక్కిస్తున్నారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నిర్మిస్తున్నారు.