'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది నటి రష్మిక. కర్ణాటకలోని విరాజ్‌పేటలో 1996 ఏప్రిల్ 5న జన్మించింది. 2016లో విడుదలైన కన్నడ సినిమా 'కిర్రిక్ పార్టీ'తో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'అంజనీపుత్ర', 'చమక్' కన్నడ సినిమాల్లో నటించింది.
2018లో నాగశౌర్య హీరోగా తెరకెక్కిన 'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది రష్మిక. 'గీతా గోవిందం' చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది. ఆ తర్వాత 'దేవదాసు', 'డియర్ కామ్రేడ్', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ'లో నటనతో మెప్పించింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది. నేడు (ఏప్రిల్ 5) రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ప్రత్యేక విశేషాలు మీకోసం.
నితిన్ సీక్రెట్ కనిపెడతా
దేనినైనా సరే తెలుసుకోవాలనే ఉత్సాహం నాలో చాలా ఎక్కువ. అలా ఒకరోజు కుక్క బిస్కెట్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనిపించింది. అందుకే ఒక చిన్న ముక్క టేస్ట్ చేశా అంతే. అది నా సీక్రెట్. దానిని మొన్న నితిన్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. నా సీక్రెట్ బయటపెట్టాడు కాబట్టి నేను కూడా తనకు సంబంధించిన ఏదో ఒక సీక్రెట్ కనిపెట్టి బయటపెడతా. (నవ్వులు)
నిశ్చితార్థానికి రెండు రోజుల ముందు
నేను కాలేజీలో ఉన్నప్పుడు 'అఆ' మూవీ చూశా. ఆ సినిమా బాగా నచ్చేసింది. ఒకవేళ సినీరంగంలోకి వెళ్తే తప్పకుండా ఇలాంటి మంచి సినిమా చేయాలనుకున్నా. 'భీష్మ' సినిమా షూటింగ్ మొదటిరోజు నితిన్‌ను చూసి ఎలా ఉంటారో? కలుస్తారో లేదో అని భయపడ్డా. కానీ ఆరోజు నితిన్, వెంకీ సరదాగా మాట్లాడుకోవడం చూసి.. ఓకే.. నేను కూడా సరదాగా ఉండొచ్చు అని ఫిక్స్ అయ్యా. నితిన్ చాలా సరదాగా ఉంటారు. నిశ్చితార్థానికి రెండు రోజుల ముందు నితిన్ తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు.
వాలెంటైన్స్ డే.. చాలా బోర్
ఈ ఏడాది నా వాలెంటైన్స్‌డే చాలా బోర్‌గా గడిచింది. ఎందుకంటే ఆరోజు ఉదయాన్నే జిమ్‌కు వెళ్లి బాగా వర్కౌట్లు చేశా. ఆరోజు నా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. దాంతో ఇంటికి వెళ్లి ఒక ఇంగ్లీష్ రొమాంటిక్ సినిమా పెట్టుకొని చూశా. ఆ సినిమా 20 నిమిషాలు చూసేసరికి బాగా బోర్ కొట్టింది. అదే సమయంలో నాకు కథ చెప్పడానికి ఒక వ్యక్తి వస్తే అతడు చెప్పిన కథ విన్నా. అలా ఆరోజు అంతా బోర్‌గా గడిచింది. ఇలాంటి బోరింగ్ వాలెంటైన్స్ డే ఎవరికీ ఉండి ఉండదు. ఆరోజు నైట్ డిన్నర్‌కి వెళ్లా.
ఆ సాంగ్ ఎంజాయ్ చేశా..
'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నేను చేసిన 'హీ ఇజ్ సో క్యూట్.. హీ ఇజ్ సో స్వీట్' పాటలోని స్టెప్పులను చాలా మంది టిక్‌టాక్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆ పాటను నేను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశా.
కథ ఎంపికలో అవి ముఖ్యం..
నేను ఏదైనా కథను ఎంపిక చేసుకునే సమయంలో కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటా. ఆ కథ నన్ను ఎంతలా సస్పెన్స్ చేస్తుంది అనేది చూస్తా. తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్సుకతను ఆ కథ నాలో పెంచాలి. అలాగే ఆ కథ ప్రేక్షకుడిని ఎంతవరకూ మెప్పిస్తుంది అనేది ఆలోచిస్తా.
అలాంటి సినిమా మళ్లీ చేయను..
'‘సరిలేరు నీకెవ్వరు' సినిమా గురించి ట్రోల్స్ వచ్చాయని మీరు(విలేకర్లు) చెప్పేవరకూ నాకు తెలియదు. నిజం చెప్పాలంటే ఆ సినిమాలో నా పాత్ర చాలా ఓవర్ యాక్టింగ్‌గా ఉంటుంది. డైరెక్టర్ చెప్పారు కాబట్టే అలా నటించా. ఆ పాత్ర డిమాండ్ చేయబట్టే అలా నటించాల్సి వచ్చింది. కెరీర్ ఆరంభంలో పాత్రల విషయంలో కొన్నిసార్లు ప్రయోగాలు చేయాలి. కానీ భవిష్యత్తులో అలాంటి సినిమా మళ్లీ చేయనని అనుకుంటున్నా.
డేట్స్ వల్లే..
మంచి కథ వస్తే బాలీవుడ్‌లో నటిస్తా. అయితే 'జెర్సీ' రీమేక్ ఆఫర్ వచ్చినప్పుడు.. నేను వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను. డేట్స్ కుదరకపోవడం వల్లే నేను ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.
బాలకృష్ణకు 'గీతగోవిందం' నచ్చింది
ఇటీవలే నేను బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నా. ఆ సమయంలో నేను బాలకృష్ణతో మాట్లాడాను. ఆయన చాలా సరదాగా మాట్లాడారు. ఆయన నేను నటించిన 'గీత గోవిందం' చూశానని.. తనకు బాగా నచ్చిందని అన్నారు.
ఇదీ చూడండి.. రకుల్ మంచి మనసు.. పేద కుటుంబాలకు ఆహారం పంపిణీ