స్టార్ హీరో ప్రభాస్.. చాలా తక్కువగా మాట్లాడే జెంటిల్మన్ అని చెప్పింది ప్రముఖ నటి భాగ్యశ్రీ. వీరిద్దరూ 'రాధేశ్యామ్'లో కలిసి నటించారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలతో పాటు ఈ కథానాయకుడి గురించి చెప్పిందీ భామ.
"బాహుబలి సినిమా చూసిన తర్వాత ప్రభాస్ గురించి ఒకలా అనుకున్నాను. కానీ కలిసిన తర్వాత అది తప్పని తేలింది. అతడు చాలా తక్కువగా మాట్లాడే జెంటిల్మన్. జట్టులోని సభ్యుడిలా చిత్రబృందంలోని ప్రతిఒక్కరితోనూ అనుబంధం ఏర్పరుచుకుంటాడు"
-భాగ్యశ్రీ, ప్రముఖ నటి
జార్జియా, హైదరాబాద్‌లో జరిగిన 'రాధేశ్యామ్' షెడ్యూల్స్‌లో భాగ్యశ్రీ పాల్గొంది. ఈ చిత్రంతో పాటే కంగనా రనౌత్ 'తలైవి'లోనూ కీలక పాత్రలో నటిస్తోంది. పలు తెలుగు, తమిళ చిత్రాలు అంగీకరించేందుకు సిద్ధమవుతోంది.
మళ్లీ సినిమాల్లో రావడానికి తన కుమారుడు అభిమన్యునే కారణమని చెప్పింది భాగ్యశ్రీ. అమ్మను మళ్లీ నటించమని ఒప్పించేందుకు తనకు దాదాపు రెండేళ్లు పట్టిందని చెప్పాడు అభిమన్యు.
'రాధేశ్యామ్' సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. పూజా హెగ్డే హీరోయిన్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.