ఒకానొక సమయంలో తాను ప్రేమలో ఉన్నమాట వాస్తవమేనని నటి అంజలి అన్నారు. అంతేకాకుండా కొన్ని కారణాల వల్ల ప్రేమలో విఫలమయ్యానని తెలిపారు. 'వకీల్‌సాబ్' ప్రమోషన్‌లో పాల్గొన్న ఆమె ప్రేమ, పెళ్లిపై తన మనసులోని మాటను బయటపెట్టారు.
"గతంలో నేను ప్రేమలో పడిన మాట వాస్తవమే. ఒక వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడ్డాను. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది సఫలం కాలేదు. ఒకవేళ మా బంధం కనుక సక్సెస్ అయిఉంటే తప్పకుండా ఆ వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేసేదాన్ని. ప్రేమ విఫలమైన బాధను తట్టుకోవడం ఎంతో కష్టం. ఆ బాధ నుంచి బయటకు వచ్చానంటే కారణం మా అమ్మ. నా వృత్తి. అమ్మ ఇచ్చిన ధైర్యంతోనే నేను తిరిగి సంతోషకరమైన జీవితంలోకి రాగలిగాను. ఇక పెళ్లి విషయానికి వస్తే ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాలపైనే ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటా".
- అంజలి, కథానాయిక
అంతేకాకుండా తనకి పెళ్లై పిల్లలు పుట్టారని ఎన్నోసార్లు సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయని.. వాటిల్లో ఎటువంటి నిజం లేదని ఆమె అన్నారు.
'నిశ్శబ్దం' తర్వాత అంజలి తెలుగులో నటించిన చిత్రం 'వకీల్‌సాబ్'. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అంజలి ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాత. నివేదా థామస్, అనన్య, ప్రకాశ్‌రాజ్ ముఖ్య భూమికలు పోషించారు. 'పింక్' రీమేక్‌గా ఈ సినిమా రానుంది. ఏప్రిల్ 9న విడుదల కానుంది.
ఇదీ చూడండి: నిషా కళ్లతో కైపెక్కిస్తున్న గ్లామర్ బ్యూటీ!